అది నాకే ఎక్కువ బాధ కలిగించే విషయం !

రెండు సినిమాలు యూత్ లో సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ‘ఫిదా’ సినిమాతోను .. ఆ తరువాత విడుదలైన ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’తోను సాయిపల్లవి సక్సెస్ సాధించింది. నాగశౌర్యతో కలిసి ఆమె తమిళంలో ‘కరు’ అనే సినిమా చేసింది. తెలుగులో ఈ సినిమాను ‘కణం’ పేరుతో విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య సాయిపల్లవి గురించి నాగశౌర్య మాట్లాడుతూ అసహనానికి లోనయ్యాడు. సమయానికి ఆమె షూటింగుకి రాకపోవడం వలన తాను చాలా ఇబ్బంది పడినట్టుగా చెప్పాడు. ఆయన చేసిన విమర్శలపై తాజాగా సాయిపల్లవి మాట్లాడింది…. ‘నాగశౌర్య చేసిన కామెంట్స్ గురించి చదవగానే నేను ‘కణం’ దర్శకుడికి ఫోన్ చేసి .. తన వలన ఎవరైనా ఇబ్బంది పడ్డారా? అని అడిగాను .. అలాంటిదేం లేదని ఆయన చెప్పారు’. నా వలన ఎవరైనా ఇబ్బంది పడితే అది అవతలవారికన్నా నాకే ఎక్కువ బాధ కలిగించే విషయం అవుతుంది. అయినా నేను నాగశౌర్య వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది.

భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేసా !

‘కరు’ (‘కణం’)చిత్రంలో నటించడానికి నటి సాయిపల్లవి మొదట నిరాకరించిందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ చెప్పారు. ‘కరు’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో  దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ…. ఈ కథను అనుకున్నప్పుడే ఇందులో హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే  బాగుంటుందని భావించామన్నారు. ఆమెను కలిసినప్పుడు ‘కరు’ చిత్రంలో నటించలేనని ఖరాఖండిగా చెప్పారని అన్నారు. అయితే ఒకసారి కథ వినండి ఆ తరువాత చెప్పండి అని అడగడంతో …కథ విన్న సాయిపల్లవి ఈ చిత్రంలో తాను నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఈ చిత్రానికి పక్కా బలం సాయిపల్లవే అని పేర్కొన్నారు. అదే విధంగా నాగశౌర్య చాలా బాగా నటించారని, ఆయనకు తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు విజయ్‌ అన్నారు.ఆయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం కరు. ఇందులో టాలీవుడ్‌ యువ నటుడు నాగశౌర్య హీరోగానూ, నటి సాయిపల్లవి హీరోయిన్‌గా నటించారు. సాయిపల్లవికి తమిళంలో ఇదే తొలి చిత్రం. వెరేకా అనే బాల నటి ప్రధాన పాత్రను పోషించిన ఇందులో నిగల్‌గళ్‌ రవి, రేఖ, సంతాన భారతి, ఎడిటర్‌ ఆంటోని ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్యామ్‌. సీఎస్‌ సంగీతం అందించారు.

ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. తాను అనూహ్యంగా నటిగా రంగప్రవేశం చేశానని చెప్పారు. తమిళ సినీ అభిమానులే తనని ఈ స్థాయికి తీసుకొచ్చారన్నారు. తన తొలి చిత్రాన్ని (ప్రేమమ్‌ మలయాళ చిత్రం) తమిళ ప్రేక్షకులు విజయవంతం చేశారని, దీంతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అందుకే తమిళంలో మంచి చిత్రం ద్వారా పరిచయం అవ్వాలని భావించానన్నారు. అందువల్ల ఇంత ఆలస్యమైందని చెప్పారు. దర్శకుడు విజయ్‌ ‘కరు’ చిత్ర కథ చెప్పగానే ఇదే తన ఎంట్రీకి సరైన కథ అని భావించానన్నారు. ‘కరు’ చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పాత్రలో జీవించే ప్రయత్నం చేశానని అన్నారు.