ఇక్కడికి చేరుకోవడానికి ఎక్కువ సమయమే పట్టింది !

”మైనే ప్యార్‌ కియా’ చిత్రం నుంచే నా కంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. బాలీవుడ్‌లో నాకు లభించిన ఆ ప్రత్యేకతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగిస్తూనే ఉన్నా. ఈ చిత్రసీమలో ‘సల్లూ నుంచి భాయీజాన్‌ వరకూ ఎదిగిన నా కెరీర్‌ పట్ల సంతోషంగా ఉన్నా’ అని పేర్కొన్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌. సల్మాన్‌ ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటాడో మనకు తెలియంది కాదు. తన ఫిట్‌నెస్‌, ఆటిట్యూడ్‌తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. ‘ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమి’ (ఐఐఎఫ్‌ఏ) అవార్డుల వేడుకలో ఆయన మాట్లాడారు…
“30 ఏళ్లుగా అభిమానులకు దగ్గరవుతూ వారి ప్రేమను పొందుతున్నా. వారి అంచనాలకు చేరువయ్యేలా హార్డ్‌వర్క్‌ చేస్తున్నా. 1989లో వచ్చిన ‘మైనే ప్యార్‌ కియా’ సినిమా తర్వాత నేనొక స్పెషల్‌ బ్రాండ్ గా ఎస్టాబ్లిష్‌ అయ్యాను. “సల్లూ, సల్లే నుంచి భాయి, భాయీజాన్‌” అని అనిపించుకోవడానికి నాకు 30 ఏళ్లు పట్టింది. ఈ లక్ష్యం చేరుకోవడానికి నేను ఎక్కువ సమయం తీసుకున్నా. అయినా నా కెరీర్‌ పట్ల సంతోషంగా ఉన్నా. ఫిట్‌నెస్‌ కాపాడకోకపోతే ప్రేక్షకులు చూడరు. సినిమాల్లో, టీవీల్లో, ఇతరత్రా ఫంక్షన్లలో నిత్యం నన్ను చూస్తూనే ఉంటారు… కాబట్టి వాళ్లను ఎప్పటికీ నిరాశపర్చను. నేను గతంలో చేయలేదు. కానీ, ఇప్పుడు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నా. అదేంటన్నది భవిష్యత్తులో స్క్రీన్‌పైనా, టీవీల్లోనూ, నా రియల్‌ లైఫ్‌లోనూ చూస్తారు. నా ఈ ఎదుగుదలకు కారణం నా అభిమానుల ప్రోత్సాహమే . ఫ్యాన్స్‌ నా సినిమాలు ఎక్కువగా చూసి నన్ను అభినందించాల్సి ఉంది” అని పేర్కొన్నారు.
‘ఇన్షా అల్లా’లో సల్మాన్‌ ఉన్నాడా?
దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో రూపొందించాలని భావించిన ‘ఇన్‌షాల్లా’ సినిమా తెరకెక్కనుందా? ఆగిపోయిందా? అన్నది సస్పెన్స్‌. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే మొదలైంది. ఇందులో కథానాయిక ఆలియా భట్‌ చిత్రీకరణలో పాల్గొన్న ఐదో రోజు ఆ విషయాన్ని వెల్లడించింది. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులూ- చేర్పులు చేయాలని సల్మాన్‌ ఒత్తిడి తెచ్చేసరికి ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చేస్తున్నారా? లేదా? అన్న దానిపై ఓ గందరగోళం ఏర్పడింది. ఈ తరుణంలో మరో చర్చ మొదలైంది. ఈ సినిమా మాత్రం తెరకెక్కిస్తారు కానీ, అందులో సల్మాన్‌ ఉంటారా? లేదా? అన్నదే అనుమానం అనేది ఇప్పుడు కొత్త చర్చ. ”భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ అనుకున్న నటీనటులతో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ అందులో సల్మాన్‌ మాత్రం ఉండరు’ అని ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రిక పేర్కొంది. సల్మాన్‌ని కాదన్న తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారట. సల్మాన్‌ స్థానంలో కొత్తవారి కోసం అన్వేషణ జరుగుతుందట.
ముంబై రోడ్డు మీద సైకిల్‌పై షికారు
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలతో ముంబై రోడ్లు జలమయ్యాయి. దీంతో నగరవాసులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముంబై వీధుల్లో చక్కెర్లు కొట్టాడు. జోరున కురుస్తోన్న వర్షంలో తడుచుకుంటూ సైకిల్‌పై షికారు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌ఛల్ చేస్తోంది. సల్మాన్ ప్రస్తుతం ‘దబాంగ్ 3’ చిత్రంలో నటిస్తోన్న విషయం విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. ఆ చిత్రం షూటింగ్‌కు సైకిల్‌పై వెళ్ళిన సల్మాన్ అందరినీ ఆశ్చర్యపరచాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కారులో వెళ్ళడంకన్నా సైకిల్‌పై వెళ్ళడమే బెటరని అనుకున్నట్లుంది… సల్మాన్‌ను రోడ్డు మీద చూసిన నగరవాసులు నిర్ఘాంతపోయారు. కొందరు ఆయన దగ్గరకొచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. ఇక సల్మాన్ సైకిల్ తొక్కుతున్న వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.