ఐదు పాత్ర‌లతో స‌ల్మాన్ ప్రయోగం

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌ ఇటీవల ‘టైగర్ జిందాహై’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్రస్తుతం ‘రేస్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు సల్లూభాయ్. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వలిన్ ఫెర్నాండెజ్, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోపక్క సల్మాన్‌ ‘భారత్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్‌ ఐదు విభిన్న పాత్రల్లో అలరించనున్నట్లు బాలీవుడ్ టాక్. 25 ఏళ్ళ కుర్రాడి పాత్ర‌తో పాటు సామాన్యుడి పాత్ర‌లోను స‌ల్మాన్ క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. దక్షిణకొరియా డ్రామా ‘ఓడ్ టు మై ఫాధర్’కి ఈ సినిమా అధికారిక రీమేక్ కాగా పంజాబ్, ముంబై, ఢిల్లీ, స్పెయిన్, అబూదాబీలోని పలు లొకేషన్లలో చిత్ర షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 60 ఏళ్ళ చ‌రిత్ర‌ని చూపించేందుకు ఈ మూవీ కోసం ప్ర‌త్యేక సెట్స్ కూడా రూపొందిస్తున్న‌ట్టు టాక్. సుల్తాన్ , ‘టైగర్‌ జిందా హై’ తరువాత సల్మాన్‌-అలీ అబ్బాస్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. 2019 రంజాన్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక సాజిద్ న‌డియావాలా ద‌ర్శ‌క‌త్వంలో కిక్ 2 చేయ‌బోతున్న స‌ల్మాన్ ఈ చిత్రాన్ని 2019 క్రిస్మ‌స్‌కి విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ ! 

నాలుగేళ్ల క్రితం సాజిద్‌ నాడియాడ్‌వాలా తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘కిక్‌’. తెలుగులో రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్‌’ చిత్రానికి రీమేక్‌ ఇది.

హిందీ చిత్రంలో సల్మాన్‌ ఖాన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రణ్‌దీప్‌ హుడా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించారు. దేవీలాల్‌ సింగ్‌ (డెవిల్‌) పాత్రలో సల్మాన్‌ నటించి, బాక్సాఫీసును కొల్లగొట్టారు. అంతేకాదు దర్శకత్వం వహించిన తొలి సినిమానే 200 కోట్ల క్లబ్‌లో చేర్చిన ఘనత సాజిద్‌కు దక్కింది. బుధవారం ‘కిక్‌’కి సీక్వెల్‌గా ‘కిక్‌ 2’ చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారాయన. ‘‘వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. ‘కిక్‌ 2’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయనున్నాం’’ అని పేర్కొన్నారు సాజిద్‌.

ఇందులో సల్మాన్‌ డ్యూయెల్‌ రోల్‌ చేయనున్నారన్న వార్తలు బీటౌన్‌లో జోరందుకున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది తన ఫేవరెట్‌ ఫెస్టివల్‌ రంజాన్‌కు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘భరత్‌’ మూవీకి రెడీ అవుతున్నారు సల్మాన్‌. ఈ ఏడాది రంజాన్‌కు సల్మాన్‌ ‘రేస్‌ 3’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. గతేడాది క్రిస్మస్‌కు సల్మాన్‌ ‘టైగర్‌ జిందాహై’ చిత్రం రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. సో.. ఈ సెంటిమెంట్‌ను కొనసాగించడానికే సల్మాన్‌ వచ్చే ఏడాది క్రిస్మస్‌కు ‘కిక్‌ 2’ ప్లాన్‌ చేశారని బాలీవుడ్‌ టాక్‌.