ఈ ఏడాది అత్య‌ధిక పారితోషికంలో వీరే టాప్ !

అమెరికన్ బిజినెస్ మ్యాగ‌జైన్ పత్రిక ఫోర్బ్స్…  ప్ర‌తి ఏడాది అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న న‌టుల జాబితాను విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా పారితోషికం అందుకుంటున్న వంది మంది సెల‌బ్రిటీల జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో స‌ల్మాన్ ఖాన్ మూడో సారి త‌న మొద‌టి స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో న‌టించ‌డం, కంపెనీల‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండడం, రియాలిటీ షోల‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించడంతో ఈ 52 ఏళ్ళ హీరో 253.25 కోట్లు( అక్టోబ‌ర్ 1,2017- సెప్టెంబ‌ర్ 30, 2018) ఆర్జించాడు. దీంతో ఆయ‌న‌కి మొద‌టి స్థానం క‌ట్ట‌బెట్టారు. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 228.09 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు. అక్ష‌య్ కుమార్ ( 185 కోట్లు)తో మూడో స్థానంలో ఉన్నారు.
టాప్ 5లో నిలిచిన మ‌హిళ దీపికా ప‌దుకొణే
2012 నుండి టాప్ 5లో నిలిచిన మ‌హిళ దీపికా ప‌దుకొణే ఈ ఏడాది కూడా 112.8 కోట్లతో నాలుగో స్థానం ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత మ‌హేంద్ర సింగ్ ధోని( 101.77 కోట్ల‌తో) ఐదో స్థానంలో ఉన్నారు. ఆమీర్ ఖాన్, అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌వీర్ సింగ్‌, స‌చిన్ టెండూల్కర్, అజయ్ దేవ‌గ‌ణ్ టాప్ టెన్‌లో ఉన్నారు. గ‌త ఏడాది టాప్ 2లో ఉన్న షారూఖ్ ఈ ఏడాది టాప్ 13లోకి ప‌డిపోయారు. ప్రియాంక చోప్రా 7వ స్థానం నుండి 49వ స్థానికి ప‌డిపోయింది. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన సర్వేలో మొత్తం 18 మంది మ‌హిళ‌లు స్థానం ద‌క్కించుకోగా వారిలో అలియా భ‌ట్‌, అనుష్క శ‌ర్మ‌, తాప్సీ ప‌న్ను, న‌య‌న‌తార‌, ప్ర‌ముఖ ష‌ట్ల‌ర్ పివీ సింధు ఉన్నారు. గ‌త ఏడాది పీవీ సింధు 21వ స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.
దక్షిణాది మొదటి స్థానంలో రజినీ కాంత్
ఇక సౌత్ విష‌యానికి వ‌స్తే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రముఖ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో 14 కోట్ల తో 72వ స్థానంలో నిలిచాడు. సౌత్ నుండి సూపర్ స్టార్ రజినీ కాంత్ (50)కోట్లతో మొదటి స్థానంలో నిలువగా పవన్ కళ్యాణ్ (31.33 కోట్లు),తమిళ హీరో విజయ్ (30.33 కోట్లు), ఎన్టీఆర్ (28 కోట్లు),విక్రమ్ (26 కోట్లు),మహేష్ బాబు (24.33), సూర్య (23.67 కోట్లు), విజయ్ సేతుపతి (23.67 కోట్లు) , నాగార్జున (22.25కోట్లు), కొరటాల శివ (20కోట్లు) , ధనుష్ (17. 25 కోట్లు) , నయన తార (15.17కోట్లు), అల్లు అర్జున్ (15కోట్లు) , రామ్ చరణ్ (14కోట్లు ) తరువాతి స్థానాల్లో చోటు సంపాదించారు.