పూర్తి స్థాయి డాన్స్‌ చిత్రానికి రెడీ అవుతున్నాడు !

సల్మాన్‌ ఖాన్‌ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెమో డి సౌజా దర్శకత్వంలో ‘రేస్‌3’లో నటిస్తున్నారు. ఇది త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి రెమోతో కలిసి పనిచేయనున్నట్టు సల్మాన్‌ ప్రకటించారు…. ‘రెమోతో పూర్తి స్థాయి డాన్స్‌ నేపథ్య చిత్రం చేయాలనుంది. నెక్ట్స్‌ చేయబోయే చిత్రాల్లో ఈ సినిమా ఉంటుంది. గతేడాది రెమో, నేను కలిసి ఓ డాన్స్‌ సినిమా చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్‌ కాలేదు. ఆ స్థానంలో ‘రేస్‌ 3′ వచ్చింది. తిరిగి ఆయనతో డాన్స్‌ నేపథ్య చిత్రం చేయాలనుంది. దీని కోసమై డాన్స్‌లో శిక్షణ కూడా తీసుకుంటాను’ అని సల్మాన్‌ తెలిపారు. ప్రస్తుతం సల్మాన్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో ‘భారత్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్‌ 3’ చిత్రంలో నటించనున్నారు.

నెక్ట్స్‌ రెమో డి సౌజా డాన్స్‌ నేపథ్య చిత్రం ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ‘డాన్సింగ్‌ డాడ్‌’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో డాన్స్‌ ప్రధానంగా ఈ కథ సాగనుందట. ఇదిలా ఉంటే ‘రేస్‌’ మొదటి రెండు చిత్రాల్లో సైఫ్‌ అలీ ఖాన్‌ హీరోగా నటించారు. మూడో సినిమా కోసం దర్శకద్వయం అబ్బాస్‌-ముస్తాన్‌ సల్మాన్‌ ఖాన్‌ని కలిసినప్పుడు.. దీని తర్వాత మరోసారి రెమో డి సౌజా దర్శకత్వం చేయడమనే కండీషన్‌పై సల్మాన్‌ ఈ చిత్రం చేసేందుకు అంగీకరించారట. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రేస్‌3’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జీవితాంతం అక్కడే ఉంటాననుకున్నావా ?
బాలీవుడ్‌ కండల వీరుడు అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రేస్‌- 3  సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్‌ మీడియాతో మాట్లాడారు. అయితే, కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌కు ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తూ కొన్ని రోజుల క్రితం జోధ్‌పూర్‌ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న సల్మాన్‌కు కోపం తెప్పించింది. ‘కృష్ణజింకల కేసులో మీరు దోషిగా తేలిన సమయంలో.. మీ సినిమా నిర్మాతలు, వారి డబ్బు గురించి మీరు బాధపడ్డారా’  అంటూ జర్నలిస్టు ప్రశ్నించాడు.

అయితే అతడు ప్రశ్న ముగించేలోగానే సల్మాన్‌ కౌంటర్‌ ఇచ్చాడు…. ‘నేను జీవితాంతం అక్కడే(జైలు లోపలే) ఉంటాననుకున్నావా’ అంటూ సమాధానమిచ్చాడు. ఊహించని ఈ సమాధానానికి అవాక్కైన జర్నలిస్టు ‘అదేం లేదం’టూ సల్మాన్‌కు బదులిచ్చాడు. ‘థ్యాంక్యూ.. దాని గురించి నేనేం బాధ పడలేదం’టూ సల్మాన్‌ తిరిగి సమాధానమిచ్చాడు. కాగా కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రస్తుతం బెయిలుపై విడుదలైన సల్మాన్‌ సినిమా షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న రేస్‌ 3 సినిమాలో సల్మాన్‌తో పాటు అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, జాక్వలిన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు