నా సాదాసీదా నటనకు అదృష్టం తోడయ్యింది !

“నాకు అంత సీన్‌ లేదని చాలా మంది అనుకుంటుండగా నేను విన్నా.నేను చాలా సాదాసీదా నటుడిని. ఎలా బతికేస్తున్నానో తెలియదు. కానీ ఇండిస్టీలో రాణించగలుగుతున్నాను’ అని సల్మాన్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ‘భారత్‌’ చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ ముచ్చటించారు. ‘షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ల కంటే మీరు గొప్ప అని ఎప్పుడైనా ఫీలయ్యారా?’ అని అడిగిన ప్రశ్నకు సల్మాన్‌ స్పందిస్తూ…
‘దేవుడి దయ వల్ల నేను ఎంపిక చేసుకున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద బాగా ఆదరణ పొందాయి. సినిమాలు ఆడినంత మాత్రాన నేను గొప్ప అని, షారూఖ్‌, అమీర్‌ చెత్త సినిమాలను ఎంచుకుంటున్నారని కాదు. కొన్ని సందర్బాల్లో నా సినిమాలు కూడా పరాజయం చెందాయి. అమీర్‌, షారూఖ్‌ లెజెండ్స్‌. వారు నటించిన సినిమాలు ఫ్లాపైనా నటులుగా తమ ప్రతిభను చాటుకున్నారు. కానీ నాకు అంత సీన్‌ లేదని చాలా మంది అనుకుంటుండగా నేను విన్నా. నిజం చెప్పాలంటే నా సాదాసీదా నటనకు అదృష్టం తోడు కావడంతో పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాను. జీవితంలో ఎత్తు పల్లాలు సహజమే. మాకున్న అభిమానుల వల్ల రాణించ గలుగుతున్నాం’అని తెలిపారు.
‘ట్యూబ్‌ లైట్‌’ పరాజయం గురించి చెబుతూ… ‘భజరంగీ భాయిజాన్‌’ తర్వాత నేను ఎంచుకున్న బ్యూటిఫుల్‌ స్క్రిప్ట్‌ అది. టీమ్‌ అంతా అదే నమ్మారు. సినిమా రంజాన్‌ సందర్భంగా విడుదల కావడం మైనస్‌ అయ్యింది. పండుగ సందర్భంగా అంతా హ్యాపీగా సాగే సినిమాని చూడాలనుకుంటారు. కానీ ‘ట్యూబ్‌లైట్‌’ అందరినీ ఏడిపించింది. చాలా మంది సినిమా చూసి పండుగని నాశనం చేశాడు అన్నారు. అందుకే ఫ్లాప్‌ అయ్యింది. ఈ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. టీవీల్లో సినిమాని చూసి ఆడియెన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పరాజయం చెందినా రూ.110కోట్లు వసూలు చేసింది. నా సినిమాలు ఫ్లాప్‌ అయినా వంద కోట్లు రాబడతాయి. చాలా సినిమాలు ఇంత మాత్రం కూడా రాబట్టలేకపోతున్నాయి. హిట్‌ అయిన నా సినిమాని ఫ్లాప్‌ అనడం విచిత్రంగా ఉంది. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని’ అని తెలిపారు.
ప్రస్తుతం అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారత్‌’లో కత్రినా కైఫ్‌, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా రంజాన్‌కి విడుదల కానుంది. దీంతోపాటు ప్రభుదేవా దర్శకత్వంలో సూపర్‌ హిట్‌ ఫ్రాంఛైజీ ‘దబాంగ్‌ 3’లో నటిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం విదితమే. అనంతరం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ ఓ సినిమా చేయనున్నారు.