కథకు గ్లామర్‌ అవసరం అయితే చెయ్యడం తప్పుకాదు !

కథకు గ్లామర్‌ అవసరం అయితే అలా నటించడం తప్పుకాదు…అని అంటోంది సమంత. చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కెరీర్‌ ముగిసిపోతుందని భయపడతారు. అయితే ఈ విషయంలో నటి సమంత మాత్రం అలాంటి వాటికి భయపడలేదు. తన సినీజీవితం, సంసార జీవితం గురించి ఇటీవల  సమంత కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది…..

‘సినిమా గ్లామర్‌ ప్రపంచం అని తెలిసే నేను ఈ రంగంలోకి ప్రవేశించాను. కథకు గ్లామర్‌ అవసరం అయితే అలా నటించడం తప్పుకాదు. అయితే అనవసరంగా గ్లామర్‌ గుప్పించడం నాకిష్టం ఉండదు. ‘సంసార జీవితం ఎలా సాగుతోంది’ అని చాలా మంది అడుగుతున్నారు. భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవిస్తే వృత్తిలోనూ కొనసాగడం కష్టం కాదు. వివాహానంతరం నా భర్త నాగచైతన్య కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ నన్ను నటించవద్దని చెప్పలేదు. హీరోయిన్‌గా కొనసాగడం నాకు నచ్చింద’ని ఆమె తెలిపారు.

‘నాగచైతన్యకు మీకూ మధ్య గొడవలు వస్తుంటాయా అని అడుగుతుంటారు. మా మధ్య గొడవలు వస్తుంటాయి. గొడవ తర్వాత చైతూ దిగిరారు. నేనే మాట్లాడుతాను. నిజం చెప్పాలంటే… చైతూ గొడవ పడరు. నేనే గొడవ చేస్తా. ఇక సినిమాల విషయానికి వస్తే తమిళంలో విశాల్‌కు జంటగా నటించిన ‘ఇరుంబుతిరై’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. విజయ్‌సేతుపతితో ‘సూపర్‌ డీలక్స్‌’ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అదే తెలుగులో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వాటితో పాటు సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న’మహానటి’ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాని’  సమంత తెలిపారు.

నా రూల్స్‌ నేను రాసుకుంటా.. 

టాలీవుడ్‌ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకొని అక్కినేని వారి కోడలైన సమంత నెటిజన్లపై మండిపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త తీరిక దొరికిందని సమయాన్ని వృధా చేయకుండా ఆస్వాదిస్తున్నానని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. దీనికి సమంత తమిళనాడులోని తెన్‌కాశీలో బికినీ వేసుకుని సేద తీరుతోన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.  ‘చాలా అలసిపోయాను. ఇది వెకేషన్‌ టైమ్‌. ఇది కావాలని కాదు, అవసరం’  అంటూ  పేర్కొన్నారు.

అయితే ఈ బికినీ ఫొటోపై నెటిజన్లు మండిపడ్డారు. పెళ్లైన తరువాత ఇలాంటి ఫొటోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బాలీవుడ్‌ నటిలా ప్రవర్తించకు, నీకు పెళ్లైందని గుర్తు చేస్తూ.. ట్రోల్‌ చేశారు. దీనికి సమంత దిమ్మతిరిగే రిప్లే ఇచ్చారు…‘ నేనిప్పుడు ఒక కోట్‌ను పోస్ట్‌ చేయాలి. ఎందుకంటే.. నా గత పోస్ట్‌ అంత అసభ్యకరంగా ఏమి లేదు. ‘నా రూల్స్‌ నేను రాసుకుంటా.. మీరు నా నియమాలు రాయడం కాదు.. మీ రూల్స్‌ రాసుకోండి’ అని ఒక కోట్‌ను జత చేస్తూ పోస్ట్‌ చేశారు