ప్రతినాయిక ఛాయలున్న డీ గ్లామర్‌ పాత్రతో ప్రయోగం

‘పెళ్లి తర్వాత నాలో ఎలాంటి మార్పు రాలేదు. అంతా ఎప్పటిలాగే ఉంది’ అని అంటోంది సమంత. హీరో నాగచైతన్యతో సమంత వివాహం  అక్టోబర్‌లో జరిగింది. ఆ తర్వాత వెంటనే పలు చిత్రాల షూటింగ్‌లతో ఈ ఇద్దరు నూతన దంపతులు బిజీ అయిపోయారు.సమంత ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘అభిమాన్యుడు’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌  విడుదలైంది.

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ….. ‘ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. పెళ్ళి అయిన తర్వాత నేనేమీ మారలేదు. మ్యారేజ్‌ అయిన కొన్ని రోజుల తర్వాత నుంచే షూటింగ్‌ల్లో పాల్గొంటున్నా. ఇది వరకే అంగీకరించిన చిత్రాల్లో నటిస్తున్నాను’ అని తెలిపింది.
సమంత కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉండగానే టాలీవుడ్‌ యువ నటుడు నాగచైతన్యతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమ సక్సెస్‌ అవుతుందా.? వీరు అసలు పెళ్లి పీటలు ఎక్కుతారా.? అన్న ఆసక్తి, అనుమానాలతో చాలా మంది ఎదురుచూశారు. నాగచైతన్య, సమంతల వివాహం విజయవంతంగా జరిగింది. అయితే ‘వివాహానంతరం తాను నటనకు దూరం కాను’ అని సమంత ముందుగానే ప్రకటించినా, చాలా మంది ‘పెళ్లి తరువాత హీరోయిన్‌ అవకాశాలు తగ్గుతాయి’ అని అనుకున్నారు. ఇక సహ నటీమణులయితే సమంత మనకు పోటీ అవ్వదు, ఆమె అవకాశాలన్నీ తమ తలుపులు తడతాయని సంబరపడ్డారు. అలాంటి వారి  ఆశలు  తలకిందులయ్యాయి …

 

పెళ్లి అయిన వెంటనే నటించడానికి రెడీ అయిపోయిన సమంతకు అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. తెలుగు, తమిళం భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘సూపర్‌ డీలక్స్‌’తోపాటు తమిళంలో శివకార్తీకేయన్‌కి జోడీగా సమంత ఓ చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ‘సూపర్‌డీలక్స్‌’లో సమంత ప్రతినాయిక ఛాయలున్న డీ గ్లామర్‌ పాత్రలో కనిపించనుందట. ఇకపై ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించేందుకు సమంత సుముఖంగా ఉంది .కాగా ఇకపై గ్లామరస్‌ పాత్రలు చేయబోనని, నటనకు అవకాశం ఉన్న పాత్రల్నే ఎంపిక చేసుకుని నటిస్తానని అని సమంత నిర్ణయం తీసుకుంది .