నా ప్రతి సినిమా విషయంలోనూ ఇలాంటివే వస్తున్నాయి!

“నయనతార, విజయ్ సేతుపతి పక్కన బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇవ్వడం ఛాలెంజ్‌తో కూడిన విషయం. ఆ సవాల్‌ని స్వీకరించి ఈ కథకి ఓకే చెప్పాను” అని తెలిపింది సమంత. ఇటీవల ‘ఓ బేబీ’, ‘జాను’తో విమర్శకుల ప్రశంసలందుకున్న సమంత తాజాగా మరో భిన్నమైన చిత్రంలో నటిస్తుంది. ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’ పేరుతో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి నటిస్తుంది. ముక్కోణ ప్రేమ కథగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి లవర్స్‌ డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్‌ వీడియో ఆకట్టుకుంటోంది.
 
తాజాగా ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ… ‘ఆసక్తికరమైన, విభిన్నమైన కథల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ చిత్రం నా వద్దకు వచ్చింది. స్క్రిప్ట్‌ నాకు ఎంతగానో నచ్చింది. నయనతార, విజయ్ సేతుపతి పక్కన బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇవ్వడం ఛాలెంజ్‌తో కూడిన విషయం. ఆ సవాల్‌ని స్వీకరించి ఈ కథకి ఓకే చెప్పాను’ అని తెలిపింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.
 
ఆ కామెంట్స్‌కి నాకు సంబంధం లేదు!
విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించడం లేదనే వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోయే తమిళ చిత్రంలో నయనతార, సమంత కథానాయికలుగా చెయ్య బోతు న్నారు. ఇదిలా ఉంటే, త్వరలో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో చేసే చిత్రంలో కూడా కథానాయికగా సమంతనే ఎంపిక చేశారని గట్టిగా వినిపిస్తోంది. అన్ని సెట్‌ అయితే ఈ సినిమానే ముందుగా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసమే విజయ్ సినిమాలో సమంత నటించడం లేదని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. వీటిపై సమంత స్పందిస్తూ… ‘చూడండి.. నా ప్రతి సినిమా విషయంలోనూ ఇలాంటివే వస్తున్నాయి. అయినా నేను పట్టించుకోను. కథ విని అంగీకరించిన ప్రతి ప్రాజెక్ట్‌ను పర్‌ఫెక్ట్‌గా చెయ్యబోతున్నాను. సోషల్‌ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కి నాకు సంబంధం లేదు’ అని చెప్పింది.
 
సమంత ‘నువ్వు సూపర్‌స్ట్రాంగ్‌’
సమంత చూడచక్కటి రూపంతో నాజూకుగా, మెరుపుతీగలా కనిపిస్తుంది . అయితే ఫిట్‌నెస్‌ విషయంలో మాత్రం ఈమె అందరు నాయికల కంటే ముందుంటుంది. సోషల్‌మీడియాలో తరచూ తన వర్కవుట్స్‌ తాలూకు వీడియోల్ని పోస్ట్‌ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పెట్టిన ఓ వీడియోలో సమంత ఏకంగా వందకిలోల బరువుని ఎత్తి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘నిన్ను తిరిగి కలవడం ఆనందంగా ఉంది. వంద కిలోల సుమో డెడ్‌ లిఫ్ట్‌’ అంటూ ఈ వీడియోకు కామెంట్‌ను జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. సన్నగా కనిపించే సమంతలో ఇంతటి బలమెక్కడిదో ?అంటూ నెటిజన్లు ఆశ్చర్యపడుతున్నారు. మరికొందరేమో ‘నువ్వు సూపర్‌స్ట్రాంగ్‌’ అని కామెంట్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘ప్రత్యూష’ ఫౌండేషన్‌ ద్వారా సేవలందిస్తున్న సమంత త్వరలో ‘ఏకం లెర్నింగ్‌ సెంటర్‌’ పేరుతో శిల్పారెడ్డి, ముక్తాఖురానాలతో కలిసి ప్రీ స్కూల్స్‌ని ప్రారంభించబోతున్నారు.