డిఫరెంట్‌గా.. పొలిటికల్‌ లీడర్‌గా..

సమంత, విజయ్ సేతుపతి కలిసి ‘సూపర్‌ డీలక్స్‌’లో నటిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా రిలీజ్‌ అవ్వకముందే విజయ్ సేతుపతి, సమంత జోడీ మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో సమంత పొలిటికల్‌ లీడర్‌గా సిల్వర్‌స్క్రీన్‌ని షేక్‌ చేయనుందట. గత చిత్రాల్లోని పాత్రలతో పోలిస్తే …ఇందులోని సమంత పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటూ తన అభిమానులతోపాటు ప్రేక్షకుల్ని సైతం మెప్పిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘తుగ్లక్‌’ పేరుతో ఢిల్లీ ప్రసాద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారట. సమంత ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’ చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ‘మిస్‌ గ్రానీ’ రీమేక్‌ ‘ఓ బేబీ! ఎంత సక్కగున్నావే’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌), ’96’ రీమేక్‌లో నటిస్తుంటే, ‘సూపర్‌ డీలక్స్‌’తోపాటు ‘కాదైసి వివసయి’, ‘సింధుబాద్‌’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘మామనిథన్‌’ చిత్రాల్లో యాక్ట్‌ చేస్తూ విజయ్ సేతుపతి కూడా బిజీగా ఉన్నారు.
 
కంగనానే నా హీరో !
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక నటిని మరో నటి మెచ్చుకోవడం అరుదే. ఈ విషయంలో సమంత ఎప్పడు ముందే ఉంటారు. హిందీ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘మణికర్ణిక’తో నటిగా మరోసారి నిరూపించుకున్నారు కంగనా. వీరనారీ ఝాన్సీలక్ష్మీబాయ్‌ పాత్రలో కంగనా సాహసోపేతమైన నటనను ప్రదర్శించారు.
 
ఈ చిత్రంలో కంగనా నటనను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సమంత. ‘కంగనానే నా హీరో.. ప్రస్తుత హీరోయిన్లు ఎవరూ నటించడానికి సాహసించని యాక్షన్‌ కథా పాత్రను ఎంచుకుని చాలా గొప్పగా నటించిందం’టూ ప్రశంసించారు సమంత. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు.