సలహాలకంటే.. మన బాధను పంచుకునే వారు కావాలి!

ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే.. మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్‌ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ.. ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే ఒత్తిడుల నుంచి బయటపడుతాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరి జీవనశైలిలో మార్పులొచ్చాయి. ఇదివరకు వృత్తిబాధ్యతల వెంట అనుక్షణం పరుగులు తీస్తుండేవాళ్లం. ఆ పరుగును ఆపి జీవితాన్ని స్వీయవిశ్లేషణ చేసుకునే అవకాశం దొరికింది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందోననే వాస్తవాన్ని గ్రహించేలా చేసింది. మనల్ని విమర్శించేవారు మాత్రమే కాకుండా.. కష్టాల్లో ఉండే వారికి సాయపడే మంచి మనుషుల్ని ఈ క్లిష్ట సమయం పరిచయం చేసింది’ అని తెలిపింది

ఈ మూడు లక్షణాలు నచ్చుతాయి!… సమంత పెళ్లి తర్వాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సీరీస్‌లో నటిస్తోంది. త్వరలో ఈ సీరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల అభిమానులతో ముచ్చటించిన సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత..ముందు తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతోంది. ఇక తన విషయానికి వస్తే.. నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత పేర్కొంది.

ఈ కరోనా సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో దృడంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకే ప్రతి రోజు ఓ గంట సమయాన్ని వ్యాయామం లేదా యోగాకు కేటాయించాలని దాని వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలమని పేర్కొంది. ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్‌ అయ్యేది మాత్రం తానే అని చెప్పింది.

‘షేమ్ ఆన్ యూ స‌మంత’… అక్కినేని కోడ‌లు స‌మంత తొలిసారి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ట్రైల‌ర్ విడుద‌ల కాగా.. ఇందులో స‌మంత పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించింది. అయితే వెబ్ సిరీస్‌లో తమిళ జనాల కోసం ఎంతగానో పోరాడిన సైన్యాన్ని దారుణంగా అవమానిస్తూ.. సమంత పాత్రను తీర్చిదిద్దినట్లు విమర్శలు వ‌చ్చాయి. ఒక ఉగ్రవాది గానే సమంత పాత్రను డిజైన్ చేసినట్లు ఉందని తమిళ జనాలు సోషల్ మీడియాలో దారుణంగా తిట్టిపోస్తున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు ‘షేమ్ ఆన్ యూ స‌మంత’ అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి తీవ్ర ప‌ద‌జాలంతో కామెంట్లు పెట్టారు. ఇక ఇప్పుడు ఆమెకి అండ‌గా ఉన్న‌ట్టుగా సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా,విమ‌ర్శ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో స్పందించిన ద‌ర్శ‌కులు.. “వెబ్ సిరీస్ పూర్తిగా చూసిన తరువాత మాట్లాడండి. చూడకముందే అపార్ధం చేసుకోవద్దని ఎవరి మనోభావాలను దెబ్బతీయలేద”ని అన్నారు.  అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దని కూడా రిక్వెస్ట్ చేశారు.

పౌరాణిక పాత్రలో ‘శాకుంతలం’…  గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రం తెరకెక్కుతోంది. మే 10వ తేదీ వరకు షూటింగ్ జరిపి, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆపేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గం. వరకు వెసులుబాటు లభించడంతో త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. షూటింగ్ ఇంత త్వరగా మొదలుపెట్టడానికి ముఖ్య కారణం సమంత అని ..నిర్మాత నీలిమ అంటున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత గుణశేఖర్ నుండి ‘శాకుంతలం’ రాబోతోంది. పదేళ్ళ కెరీర్‌లో సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఇందులో దుష్యంతుడుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో మంచు మోహన్ బాబు, అదితి బాలన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోంది.