స్నేహితులతో కలిసి చిత్ర నిర్మాణం ?

ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు, మరో పక్క ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడడానికి రెడీ అవుతున్న సమంత త్వరలో చిత్ర నిర్మాణం చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజాగా సోషల్‌ మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.సమంత నిజంగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగనున్నారా? ఇంతకు ముందు ఇలాంటి ప్రచారమే జోరుగా సాగింది. ఈ చెన్నై చిన్నది ఒక మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులను కొనుగోలు చేశారని, ఆ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషలలో  నిర్మించి నటించనున్నారనే ప్రచారాన్ని అప్పట్లో సమంత కొట్టిపారేశారు.

సమంత తన స్నేహితులతో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టనున్నారని, అందుకు ఎస్‌వీ.పార్టనర్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే బ్యానర్‌ను కూడా నెలకొల్పనున్నట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నవిషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ చిత్రానికి సమంత తన స్నేహితులు వాణి, శ్రీరామ్‌లతో కలిసి నిర్మించాలనుకుంటున్నట్లు, ఇది తమ చిరకాల డ్రీమ్‌ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించే పరిస్థితుల్లో సమంత లేదు. ఎందుకంటే అక్టోబర్‌ ఆరవ తేదీన నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవుతున్నారు. వీరి పెళ్లి హిందూ, క్రిస్టియన్‌ మత సంప్రదాయాల ప్రకారం రెండుమార్లు జరగనుందట. ఆ ఏర్పాట్లలో ఉంటూనే సమంత తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.