మూడునెలల్లో మూడు సినిమాలతో మనముందుకు !

‘ఏ మాయ చేసావె’ చిత్రంతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చారు  సమంత. ఆ చిత్రంలో చేసిన ‘జెస్సీ’ పాత్రతో చెరగని ముద్ర వేశారీ బ్యూటీ. ఆ తర్వాత ‘దూకుడు’, ‘ఈగ’, ‘మనం’, ‘అఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘అదిరింది’ వంటి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారామె. అందుకే తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో అగ్రకథానాయికల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. కానీ ఓ విషయంలో మాత్రం సమంతకు ఆనందపడాలో, బాధపడాలో అర్థం కాని అయోమయస్థితి ఉందట….

విషయం ఏంటంటే… ఇప్పటికీ సమంత దగ్గర ‘ఏ మాయ చేసావె’ సినిమా గురించే చాలామంది ప్రస్తావిస్తున్నారట. ‘‘ఎన్నో సినిమాలు చేశాను. ఎందుకు ఆ సినిమా గురించే పదే పదే మాట్లాడుతున్నారు. ఆ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్‌. కాదనను. కానీ ఆ తర్వాత నేను ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను.వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే.. ‘ఏ మాయ చేసావె’ తర్వాత నేను అంత బాగా యాక్ట్‌ చేయలేదా? అని సమంత దిగాలు పడుతున్నారట. సోషల్‌ మీడియాలో రీసెంట్‌గా ఫ్యాన్స్‌తో జరిగిన ఓ ఇంట్రాక్షన్‌లో ఓ ఫ్యాన్‌ ‘ఏ మాయ చేసావె’ గురించి అడిగినప్పుడు.. తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే, ఏడేళ్ల క్రితం చేసిన సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారంటే ఓవైపు ఆనందంగానే ఉందని కూడా అంటున్నారామె.

వచ్చే ఏడాది మొదటి మూడు నెలలు ముగిసేలోపు సమంత మూడు సార్లు థియేటర్స్‌లో సందడి చేయనున్నారు. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుదరై’ జనవరి 26న, కీలకపాత్ర చేసిన తెలుగు ‘మహానటి’ మార్చి 29న, హీరోయిన్‌గా చేసిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదల కానున్నాయి. మూడు నెలలు ముగిసేలోపు సమంతను మూడుసార్లు సిల్వర్‌స్క్రీన్‌పై చూడటం అభిమానులకు పండగలా ఉంటుంది.

విశాల్‌ నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు !

విశాల్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు థిరాయ్‌’. తెలుగులో ఈ చిత్రం ‘అభిమన్యుడు’గా రాబోతోంది. పీఎస్‌.మిత్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ…

విశాల్‌ నాకంటే చిన్నవాడిగా అనిపిస్తాడు. ఎందుకంటే సెట్స్ లో అతను అంత చురుగ్గా ఉంటాడు. అతనితో పనిచెయ్యడం మంచి అనుభవం.  ఈ చిత్రం లో అతని లుక్, నటన చాలా బాగుంది. తప్పకుండా  ఈ చిత్రం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మిత్రన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. కానీ ఆయనతో పనిచేస్తుంటే అనుభవం ఉన్న దర్శకుడిగా అనిపిస్తారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అని చెప్పుకొచ్చారు.
యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సమంత రతి దేవి అనే సైకాలజిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. అర్జున్‌ వైట్‌ డెవిల్‌గా విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కథ వినగానే విశాల్‌ విలన్‌గా నటిస్తానని చెప్పారని కానీ హీరోగా అయితేనే బాగుంటుందని నచ్చజెప్పానని దర్శకుడు మిత్రన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు