సినిమాపై నాకున్న ప్రేమకు ఎల్లలే లేవు !

సమంత అక్కినేని… టాలీవుడ్ అటు కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న భామ సమంత. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. కొంతకాలం క్రితం నాగచైతన్యను పెళ్లిచేసుకున్న సమంత వరుస హిట్లతో దూసుకుపోతోంది. సినీ రంగంలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంకో పక్క సమాజ సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ సమంత తన సేవాతత్పరతను చాటుకుంటోంది.
దీనిపై సమంత మాట్లాడుతూ… “నేను నటిగా మంచి పేరు సంపాదించుకున్నాను. సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఈ రెండింటినీ ఏక కాలంలో ఎలా చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించడం లేదా? అని పలువురు అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే పని లేకుంటేనే నాకు ఏమీ తోయదు”అని చెప్పింది. “చిత్ర పరిశ్రమలో నాకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు. నాకంటే ప్రతిభావంతురాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లందరిని కాదని భగవంతుడు నాకు టాప్ హీరోయిన్ స్టేటస్‌ను ఇచ్చాడు. కాబట్టి నటనను నేను ప్రాణంగా భావిస్తున్నాను. సినిమాపై నాకున్న ప్రేమకు ఎల్లలే లేవు. సినిమాయే నా జీవితంగా మారిపోయింది. ప్రతిభ, పేరు, డబ్బు, హోదా అన్నింటినీ భగవంతుడు నా స్థాయికి మించి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతలతోనే పేదలకు సాయం చేస్తున్నాను. నాకు సినీ అవకాశాలు తగ్గితే, చిత్ర పరిశ్రమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే నా జీవితాన్ని పూర్తిగా సమాజసేవకు అంకితమిస్తా”అని అన్నారు.
సమంతనామ సంవత్సరం
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో సమంతనామ సంవత్సరంగా గడిచింది. ‘రంగస్థలం’ చిత్రంలో పల్లెటూరి రామలక్ష్మి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నది సమంత. చక్కటి అభినయకౌశలంతో డి గ్లామర్ పాత్రకు ప్రాణం పోసింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలైన ఈ చిత్రం సమంత కెరీర్‌లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయపరంపరను ‘యూ టర్న్’ సినిమాతో కొనసాగించింది సమంత. కన్నడ చిత్రం ‘యూటర్న్’ ఆధారంగా హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాగానే వసూళ్లను రాబట్టింది. మహిళా ప్రధాన చిత్రాలకు సమంత న్యాయం చేయగలదని నిరూపించింది. అలాగే ‘మహానటి’ లో మధురవాణి అనే పాత్రికేయురాలిగా కీలక పాత్రలో నటించి చిత్ర విజయంలో కీలకభూమిక పోషించింది. విశాల్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబుతిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో అనువాదమై ప్రశంసల్ని అందుకున్నది. ఈ ఏడాది మొత్తం విజయమే పరమావధిగా దూసుకుపోయిన సమంత నంబర్‌వన్ హీరోయిన్‌గా నిలిచింది.