పెళ్లైన మూడో రోజునే షూటింగ్‌లో ఉంటాం!

పెళ్లి అయిన కొద్దినెలల పాటు నటనకు దూరంగా ఉండనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు… త్వరలో వివాహబంధంలోకి అడుగు పెడుతున్న హీరోయిన్‌ సమంత. అంతేకాకుండా పెళ్లి అయిన మూడో రోజే షూటింగ్‌లో పాల్గొంటానని ఆమె స్పష్టం చేశారు. హీరో నాగ చైతన్య, సమంతల వివాహం అక్టోబర్‌ 6వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని, అలాగే ఈ ప్రేమపక్షులు  మూడు నెలల పాటు షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చి హానీమూన్‌ కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలపై సమంత స్పందిస్తూ….‘అక్టోబరు ఆరున మా పెళ్లి వేడుక గోవాలో జరిగేది నిజం. అయితే మా వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందనే ప్రచారం మాత్రం అవాస్తవం. ఓ సాధారణ కుటుంబంలో జరిగే పెళ్లిలా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరుగుతుంది. అలాగే పెళ్లి నేపథ్యంలో మూడు నెలలు నటనకు దూరం ఉంటామనే వార్తలు నిజం కాదు. ఇక హనీమూన్‌ ప్రణాళికలాంటిదేమీ లేదు. పెళ్లైన మూడో రోజునే ఇద్దరం షూటింగ్‌లో పాల్గొంటాం’ అని తెలిపారు.