నా డబ్బుతో నేను సొంతంగా సినిమాలు నిర్మిస్తా !

సమంత… కూడా నిర్మాతగా మారుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఆమె సినిమాలు నిర్మిస్తుందని అన్నారు. అయితే తను నిర్మాతగా మారే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది సమంత. తన మనసులో మాటను ఆమె బయటపెట్టింది…

“సినిమాలు నిర్మించాలని ఉంది. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించను. నా డబ్బుతో నేను సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను. నా సినిమాను స్క్రీన్‌పై చూసుకోవాలని ఉంది”అని పేర్కొంది. ఇక నాగార్జున, నాగచైతన్య సహకారం లేకుండా తన సొంత డబ్బులతో సినిమాలను నిర్మిస్తానంటోంది సమంత. అక్కినేని కుటుంబంలో తనకు ఆ స్వేచ్ఛ ఉందని చెబుతోంది. తను నిర్మించే సినిమాలతో కొత్త వాళ్లను ప్రోత్సహిస్తానని చెప్పింది. “కొత్త వాళ్లతో సినిమాలు తీస్తాను. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తా. అయితే నిర్మాతగా మారేందుకు కొంత సమయం ఉంది. నటిగా మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ‘యు టర్న్’, ‘రాజుగారి గది-2’ వంటి సినిమాలతో కొత్త జర్నీని ప్రారంభించాను”అని సమంత పేర్కొంది.

సమంత అద్భుతమైన నటి !
సమంత అద్భుతమైన నటి… ఈ మాట అన్నది ఎవరో తెలుసా? తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భూమిక. వివాహానంతరం కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించిన ఆమె.. ఆ తర్వాత చిన్న బ్రేక్‌ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చారు. నటనకు అవకాశమున్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె తాజా చిత్రం ‘యూటర్న్‌’.సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదలై విజయవంతమైంది.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో నటించిన భూమిక తన అనుభవాలను పంచుకున్నారు…
‘కళాకారులెవరైనా వైవిధ్యమైన, చాలెంజ్‌తోకూడిన పాత్రల్లో నటించినప్పుడే గుర్తింపు పొందుతారు. ఆత్మసంతృప్తి దొరుకుతుంది. ‘యూటర్న్‌’ చిత్రంలో నేను ఇంతవరకూ చేయని విభిన్నమైన పాత్రలో నటించాను. నా పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ఆమె తెలిపారు. ఇక, ‘యూటర్న్‌’లో ప్రధాన పాత్ర పోషించిన సమంతను భూమిక ప్రశంసల్లో ముంచెత్తారు. సమంత బ్రహ్మాండమైన నటి కితాబిచ్చారు. షూటింగ్‌లో చాలా చలాకీగా ఉంటారని, ఈ చిత్రంలో తను చాలా బాగా నటించారని అన్నారు.