నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు !

“నా లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటించిన వెబ్‌సిరీస్‌ ప్రసారం కోసం ఓ అభిమానిలా అమితాసక్తితో ఎదురు చూస్తున్నాను. నా కెరీర్‌లో వెబ్‌ సిరీస్‌లో నటిస్తానని..ఆ వెబ్‌ సిరీస్‌ కోసం ఇలా ఆసక్తిగా ఎదురు చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు ‘ అని అంటోంది సమంత. సమంత.. ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టింది.. ఇందులో ఆమె టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సమంత రెగ్యులర్‌గా సినిమాల్లో నటించే పాత్రలతో పోలిస్తే.. ఆమె ఇందులో చాలా వైవిధ్యమైన పాత్ర పోషించింది. అంతేకాదు, ఇందులో ఫైట్లు కూడా చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ల కోసం శిక్షణ కూడా తీసుకుంది. అన్నింటికి మించి ఇందులో ఆమె నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించింది. ఇలాంటి క్యారెక్టర్‌ని ఆమె పోషించడం కూడా ఇదే ఫస్ట్‌ టైమ్‌. కెరీర్‌ పరంగానే కాకుండా పర్సనల్‌గానూ సమంత జీవితంలో ఓ ప్రత్యేకత పొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను డిసెంబర్‌ నెలలో ప్రసారం చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ సిద్ధమవుతోంది.
చాలెంజింగ్‌ పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌!
‘‘నటిగా నాకు ఎలాంటి భయాలు లేవు.. ఎంతటి క్లిష్టమైన పాత్ర అయినా సరే చేయాలనుకుంటాను’’ అని అంటోంది సమంత . “సరికొత్త సవాళ్లను స్వీకరిస్తేనే మనలోని ప్రతిభ బయటపడుతుంది” అని అంటున్న సమంత… ‘మహానటి, రంగస్థలం, ఓ బేబీ’ చిత్రాల్లో చాలెంజింగ్‌ రోల్స్‌ చేసింది . తాజాగా మరో చాలెంజింగ్‌ పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. ‘మయూరి, గేమ్‌ ఓవర్‌’ చిత్రాలను తెరకెక్కించిన అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ఓ తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంలో బధిర యువతిగా నటిస్తుందట సమంత. సైకలాజికల్, హారర్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.‌. ‘మహానటి’లో నత్తి ఉన్న అమ్మాయి పాత్రను అద్భుతంగా చేసింది సమంత . ఇప్పుడు మూగ, చెవిటి అమ్మాయిగా నటించడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
 
108 సార్లు సూర్య నమస్కారాలు!
ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉంటుంది ‌సమంత. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా జిమ్‌లో చెమటలు చిందిస్తూ కఠినమైన వర్కౌట్లు చేస్తుంది.లాక్‌డౌన్‌ కాలంలో భర్త నాగచైతన్యతో కలిసి యోగా చేయడం ప్రారంభించిన సమంత. ఈ వీకెండ్‌ను సరికొత్త ఫీట్‌తో ఆరంభించారు. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి వావ్‌ అనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో చేసింది. “ఈ వారాంతానికి ఒక మంచి ఆరంభం” అన్న సమంత.. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపింది . ఇందుకు స్పందించిన సంతోష్‌..‘‘సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్‌కట్లు ఉండవని ఆమె నిరూపించారు. కఠిన శ్రమ, అంకిత భావం, సుస్థిరతకు నిదర్శనం. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎప్పుడూ నో చెప్పరు’’అని సమంతపై ప్రశంసలు కురిపించారు.