నీ కొడుకు కోసం నన్ను దోపిడీ చేసినందుకు థాంక్స్ !

‘ఖ‌డ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ సంగీత‌.పలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంగీత పదేళ్ల క్రితం క్రిష్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.సంగీత ప్ర‌స్తుతం వలసరవాక్కంలో త‌న త‌ల్లి ఇంట్లో భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తుంది. సంగీతపై ఆమె తల్లి భానుమతి ఫిర్యాదు చేసింది. ఇంటి నుండి తనను వెళ్లిపోవాలని సంగీతం ఒత్తిడి చేస్తోందని భానుమతి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. తను సంపాదించిన ఆస్తిని సొంతం చేసుకోవడానికి సంగీత ఇలా చేస్తుందని ఆరోపించడంతో సోషల్ మీడియాలో  సంగీతపై విమర్శలు మొదలయ్యాయి.దీనిపై వివరణ ఇవ్వాలని సంగీతకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది.  సంగీత తనపై ఫిర్యాదు చేసిన తల్లిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది….
 
అందులో….
”ప్రియమైన అమ్మా.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.. నన్ను స్కూల్ కి దూరం చేసి 13 ఏళ్ల వయసు నుండే పని చేయించినందుకు థాంక్యూ.. నాతో ఖాళీ చెక్కుల మీద సంతకాలు చేయించినందుకు కృతజ్ఞతలు. మందు, డ్రగ్స్ కి బానిసై జీవితంలో ఏరోజూ పనికి వెళ్ళని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు థాంక్స్. నేను పోరాడే వరకూ నాకు పెళ్లి చేయకుండా ఉన్నందుకు థాంక్స్. నన్ను, నా భర్తని రోజూ వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు థాంక్స్. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు థాంక్స్. చివరిగా నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్. నీకు తెలిసో.. తెలియకో.. నోరులేని అమ్మాయి నుండి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావ్.. ఏదోక రోజు నీ పొగరు పక్కన పెట్టి నన్ను చూసి కచ్చితంగా గర్వపడతావు” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.