ఇది నాకు కొత్త అధ్యాయం లాంటిది !

‘ఇన్‌షాఅల్లా’ నా కెరీర్‌కి ఓ కొత్త అధ్యాయం లాంటిది ‘ …అని అంటున్నారు సంజయ్ లీలా భన్సాలీ. బాలీవుడ్‌లో అద్భుత కళా ఖండాలకు పెట్టింది పేరు ఆయన. ‘పద్మావత్‌’ తర్వాత ఏడాది గ్యాప్‌తో తాజాగా ఓ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ‘ఇన్‌షాఅల్లా’ పేరుతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్నారు. ఇరవై ఏండ్ల తర్వాత సల్మాన్‌, భన్సాలీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది.
 
‘ఇన్‌షాఅల్లా’ గురించి ఆయన మాట్లాడుతూ… ”పద్మావత్‌’ విడుదలకు మూడు నెలల ముందు ఈ ఆలోచన తట్టింది. ఇది డార్క్‌, ఇంటెన్స్‌, ఎమోషనల్‌ చిత్రం కాదు. ఓ కొత్తదనం నిండిన యంగర్‌ స్టోరీ. బ్యూటిఫుల్‌ సన్‌షైన్‌ లాంటి చిత్రమవుతుంది. దీనికి సల్మాన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అనిపించింది. ఆ మధ్య ఆయనతో బేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ చేస్తారో లేదో అనుకున్నా. కానీ కథ విన్నాక ‘ఎప్పుడు చేస్తున్నాం’ అని సల్మాన్‌ అన్నారు. నాకు షాకింగ్‌తోపాటు ఆశ్చర్యం వేసింది. ఎలాంటి కల్మషం లేని మనసుతో ఆయన ఆ మాట చెప్పారు. ఇప్పుడు సల్మాన్‌ ఓ మెగాస్టార్‌. అయినప్పటికీ కామన్‌ మ్యాన్‌లాగే ఉంటారు. అదే ఆయనలోని గొప్పతనం. మేమిద్దరం కలవడానికి ఇది సరైన ప్రాజెక్ట్‌ అనిపించింది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు పది సినిమాలు చేశా. వాటి కంటే ఇది ‘ది బెస్ట్‌’ చిత్రమవుతుందని నమ్ముతున్నా.
 
అలియా భట్‌ చాలా చిన్న వయస్కురాలు. కానీ వెండితెరపై ఎంతో మ్యాజిక్‌ చేస్తుంది. ‘బ్లాక్‌’ చిత్ర టైమ్‌లో ఛాన్స్‌ కోసం నా వద్దకు వచ్చింది. ఆమె కళ్ళలో ఏదో తెలియని స్పార్క్‌ కనిపించింది. గతంలో ఓ సినిమాకి అనుకున్నా. కానీ అది కుదరలేదు. ఈ చిత్రంలో నటించడం ఓ అందమైన జర్నీ కాబోతుంది. దీంతోపాటు ‘సాహిర్‌ లుదియాన్వి’ బయోపిక్‌, ‘గంగూబాయి’ కథతో ఓ సినిమా చేయాలని ఉంది. అవి భవిష్యత్‌లో ఉంటాయి. ‘గంగూబాయి’కి సంబంధించి ప్రియాంకతో చర్చిస్తున్నా. నా మొదటి సినిమాతో పోల్చితే నేను దర్శకుడిగా, వ్యక్తిగా చాలా పురోగతి చెందా. ‘సావరియా’, ‘పద్మావత్‌’ చిత్రాలు వివాదమయ్యాయి. కానీ అంతకుమించిన ప్రేమ, ఆదరణ ఆడియెన్స్‌ నుంచి లభించింది. అవి బాక్సాఫీసు వద్ద సత్తా చాటాయి. అవార్డు ఫెస్టివల్స్‌లో ప్రశంసలందుకున్నాయి. ఇవన్నీ నన్ను ఓ ఫిల్మ్‌ మేకర్‌గా చాలా దృఢంగా, ఉక్కులా మార్చాయి’ అని అన్నారు.