‘పద్మావతి’ని విడుదల కానివ్వం !

సంజయ్‌ లీలా భన్సాలీ సినిమా తీస్తున్నారంటే అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆ అంచనాలకు తగ్గకుండానే ‘పద్మావతి’ ఫస్ట్‌లుక్‌ను తీసుకొచ్చారు. అటు సినీ విమర్శకులు, ఇటు ఫ్యాన్స్‌ నుంచి భారీ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఇది విడుదలైన రెండు రోజుల్లో ఈ చిత్రంపై మళ్లీ వివాదం మొదలైంది. సినిమాను విడుదల కానివ్వబోమని ‘రాజ్‌పుత్‌ కర్ణి సేన’ హెచ్చరించింది. భన్సాలీ తమకిచ్చిన మాట తప్పారని, తమ అనుమతి లేనిదే ఎలా విడుదల చేస్తారో? చూస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో చల్లారిందన్న వివాదం మళ్లీ మొదటకొచ్చింది.

మేవార్‌ పాలకుడు రాణా రావల్‌ రతన్‌ సింగ్‌ భార్య యువరాణి ‘పద్మావతి’ జీవిత కథే ఈ చిత్రం. ఢిల్లీని పాలిస్తున్న అల్లావుద్దీన్‌ ఖిల్జీ 1303లో రాణా ఆధీనంలో ఉన్న చిత్తోర్‌పై దండెత్తుతాడు. ఆ సమయంలో పద్మావతిని చూస్తాడు.. తర్వాత ఏం పద్మావతి ఖిల్జీని ఎదుర్కొందా? లేదా? అసలు ఏం జరిగిందన్నదానిపైనే ఈ సినిమా రూపొందిస్తున్నారు భాన్సాలీ. ఇందులో టైటిల్‌ పాత్రలో దీపికా పదుకొనే నటిస్తోంది. రాణా రావల్‌ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌ చేస్తున్నాడు. అల్లావుద్దీన్‌ ఖిల్జీగా రణవీర్‌ సింగ్‌ మెప్పించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను గత ఏడాది రాజస్తాన్‌లోని కొల్హాపూర్‌లో ప్రారంభించారు. అక్కడ భారీ  సెట్‌ వేశారు. శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన, దాని అనుబంధ సంఘాలు వారు ఆ సెట్‌పై దాడి చేసి తగలబెట్టారు. అప్పుడు చాలా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఇక్కడ వివాదం తప్పదని భావించిన భన్సాలీ ఈ ఏడాది జనవరిలో జైపూర్‌లోని నాహర్ఘ్‌ పోర్టుకు ఈ సెట్‌ను మార్చాడు. అక్కడ కూడా రాజ్‌పుత్‌ కర్ణి సేన సభ్యులు దాడి చేశారు. దీంతో రెండు సార్లు చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తొలిత భావించిందీ చిత్రబృందం. కానీ ఆటంకాలు వల్ల అది సాధ్యం కాదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ ఒకటో తేదీన కచ్చితంగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీనిలో భాగంగా గురువారం ‘పద్మావతి’ పాత్రలో దీపికా పదుకొనే లుక్‌కు సంబంధించి రెండు ఫొటోలను విడుదల చేశారు. దానికి అపూర్వమైన స్పందన లభించింది. మహారాణిలా దీపికా మెరిసిపోయిందని అటు సినీ విమర్శకులు, ఇటు అభిమానులు భన్సాలీని ప్రశంసలతో ముంచెత్తారు. అభిమానుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తీస్తున్నామని ప్రకటించాడు భన్సాలీ.

ఈ ఫస్ట్‌లుక్‌ విడుదలైన రెండో రోజు అంటే శనివారం శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన, దాని అనుబంధ సంఘాలు నిరసన తెలిపాయి. జైపూర్‌లోని రాజ్‌మందిర్‌ సినిమా థియేటర్‌ వద్ద ‘పద్మావతి’ పోస్టర్లను తగలబెట్టి ఆందోళన చేశాయి. భన్సాలీకి వ్యతిరేకంగా నినదించాయి. ఈ చిత్రాన్ని విడుదల చేయనీబోమని హెచ్చరించాయి. గతంలో భన్సాలీ తమకిచ్చిన హామీని తప్పారని అందుకే తామంతా నిరసిస్తున్నట్టు స్పష్టం చేశారు కర్ణి సేన సభ్యులు. రాజ్‌పుత్‌ కర్ణి సేన జిల్లా అధ్యక్షుడు నారైన్‌ సింగ్‌ దివ్రాలా మాట్లాడుతూ… ”జైపూర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగినప్పుడు భన్సాలీ మాకు హామీ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం రూపొందిన తర్వాత విడుదలకు ముందే మాకు రెండు షోలు వేస్తామని చెప్పారు. దానికి సంబంధించి ఎవరూ మమ్మిల్ని ఇప్పటి వరకూ సంప్రదించలేదు. ఈ సినిమానూ మాకు చూపించలేదు. కర్ణి సేన అనుమతి లేకుండా ఈ సినిమాను థియేటర్లకు రానివ్వం. ఈ సినిమా విడుదలకు ముందు మా శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన కోర్‌ కమిటీ, దాని అనుంబంధ సంఘాలకు, చరిత్రకారులకు చూపించాలి. అప్పటి వరకూ విడుదలకు మేం అంగీకరించం. ఆ షరతుకు భన్సాలీ అంగీకరించారు. కానీ ఇప్పుడు మాట తప్పారు. వాస్తవాలను వక్రీకరించి సినిమా తీశారు. అందుకే మాకు ముందు చూపించాలంటున్నాం. ఈ చిత్రం చూశాక మా కర్ణి సేన కోర్‌ కమిటీకి, చరిత్రకారులకు ఎటువంటి సమస్య లేకపోతే విడుదల చేసుకోవచ్చు” అని అన్నారు. ఈ సినిమా డిసెంబర్‌ ఒకటో తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.