కార్తికేయ-శ్రియ-జయం రవి ‘సంతోషం’ అవార్డు గ్రహీతలు

‘సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019’ ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం నిర్విరామంగా సాగిన ఈ వేడుకలో తారల ప్రసంగాలు, డాన్స్‌ పర్ఫార్మెన్స్‌లు, సరదా స్కిట్‌లు హైలైట్‌గా నిలిచాయి. అలనాటి తార జమున, ప్రభ, రోజారమణి, నటి`దర్శకురాలు జీవిత, నటులు రాజేంద్రప్రసాద్‌, రాజశేఖర్‌, బాబూమోహన్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌, కార్తికేయ, రాంకీ, విష్వక్‌సేన్‌, నేటి తారలు శ్రియ, శివానీ, శివాత్మిక, నటాషా దోషి, అవికా గోర్‌, దీప్తి సునయన, ప్రముఖ నిర్మాతలు డి. సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, అంబికా కృష్ణ, దిల్‌ రాజు, తమిళ హీరో జయం రవి, కన్నడ నటుడు, ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌, తమిళ వెటరన్‌ యాక్ట్రెస్‌ కుట్టి పద్మిని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంగీత దర్శకుడు తమన్‌, గాయకుడు అనురాగ్‌ కులకర్ణి తదితరులు ఈ వేడుకకు హాజరై ఆకర్షణగా నిలిచారు.
 
ప్రముఖ ఫిల్మ్‌ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి సీనియర్‌ హాస్యనటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌ చేతుల మీదుగా ‘ఫిల్మ్‌ జర్నలిజంలో లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డు అందుకున్నారు. ఉదయభాను, సమీర్‌, తనీష్‌, తేజస్విని మదివాడ యాంకర్లుగా చేసిన ఈ వేడుకలో కామెడీ హీరో సంపూర్ణేష్‌బాబు, హీరోయిన్లు నభా నటేష్‌, అవికా గోర్‌, నటాషా దోషి, తేజస్విని, దీప్తి సునయన చేసిన డాన్స్‌ పెర్ఫార్మెన్సులు, సింగర్స్‌ రఘురామ్‌, శ్రుతి, గాయత్రి ఆలపించిన పాటలు, ఉప్పల్‌ బాలు పర్ఫార్మెన్స్‌ ప్రేక్షకులను అమితంగా అలరించాయి.