‘సంతోషం’ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ కర్టెన్ రైజ‌ర్స్

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో పాత్రికేయుడిగా ‘కృష్ణ ప‌త్రిక‌’లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ‘సంతోషం’ సినీ వార ప‌త్రికతో అంద‌రికీ సంతోషం సురేష్‌గా ప‌రిచ‌య‌మైన సురేష్ సంతోషం అవార్డ్స్ పేరిట 15 సంవ‌త్స‌రాలుగా అవార్డుల‌ను బ‌హుక‌రిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సంతోషం 16వ వార్షికోత్స‌వంలోకి అడుగుపెట్టింది. 2017, ఆగ‌స్ట్ 12న సంతోషం అవార్డుల వేడు ప్ర‌ధానోత్స‌వం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన క‌ర్టెన్ రైజ‌ర్స్ ప్రోగ్రామ్‌లో సంతోషం సురేష్‌, హీరో ఆది, మా అధ్య‌క్షుడు శివాజీ, రెజీనా, హెబ్బా ప‌టేల్‌, ఏడిద రాజా, ఏడిద శ్రీరాం త‌దిత‌రులు పాల్గొన్నారు.

‘మా’ అధ్య‌క్షుడు శివాజీ మాట్లాడుతూ – సంతోషం సురేష్ వెనుక ఇండ‌స్ట్రీ అంతా ఉంటుంది. ఇదంతా అత‌ను చిరునవ్వుతో సంపాదించుకున్న‌దే. పాల‌కొల్లు నుండి వ‌చ్చిన రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. మా అసోసియేష‌న్ త‌ర‌పున పేద క‌ళాకారుల‌కు ఆర్ధిక సాయాన్ని చేస్తున్నారు. ఈ అవార్డ్స్ వేడుక వందేళ్లు జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను…అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ – సంతోషం అవార్డ్స్‌లో ప్రేమ కావాలి చిత్రానికి నాకు బెస్ట్ డెబ్యూ హీరోగా అవార్డ్ వ‌చ్చింది. 15 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. సురేష్‌గారికి అభినంద‌న‌లు. ఇలాంటి అవార్డ్ ఫంక్ష‌న్స్ ఎన్నోజ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను… అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ – సురేష్ కొండేటిగారికి, సంతోషం అవార్డ్స్ టీంకు అభినంద‌న‌లు. ఇలాంటి విజ‌యాలు మ‌రెన్నో సాధించాల‌ని కోరుకుంటున్నాను…అన్నారు.

రెజీనా మాట్లాడుతూ – నేను తెలుగు ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత నేను విన్న అవార్డ్స్ సంతోషం అవార్డ్స్‌. ఒక వ్య‌క్తిగా సురేష్‌గారు ఈ అవార్డ్స్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంత ఈజీ కాదు. ఇలాంటి మంచి విష‌యాన్ని చేస్తున్న సంతోషం సురేష్‌, అత‌ని టీంను అభినందిస్తున్నాను. ఈ అవార్డ్స్ ఇలాగే పాతిక‌, యాబై ఏళ్లు కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను… అన్నారు.

సంతోషం సురేష్ మాట్లాడుతూ – గ‌త ప‌దిహేనేళ్లుగా న‌న్ను ఎంక‌రేజ్ చేస్తూ వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. ప్ర‌తి ఏడాది ఏదో ఒక స‌ర్‌ప్రైజ్‌తో సంతోషం అవార్డ్స్ జ‌రుగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అలాంటి స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌తో సంతోషం అవార్డ్స్ జ‌రుగుతుంది. చిరంజీవిగారు, నాగార్జున‌గారు, బాల‌కృష్ణ‌గారు, వెంక‌టేష్‌గారు ఇలా అంద‌రూ హీరోలు న‌న్నెంగానో స‌పోర్ట్ చేశారు. నేను ఉన్న రోజులు ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తాను. నాగార్జున‌గారు కార‌ణంగానే ఈ అవార్డ్స్ కంటిన్యూ చేస్తున్నాను. మొద‌టి వార్షికోత్సవంలో నాగార్జున ఫిలింఫేర్‌లా మ‌న‌కు కూడా సంతోషం అవార్డ్స్ ఉంటే బావుంటుంద‌ని అన్నారు. ఆయ‌న చిన్న కోరిక‌ను నేర‌వేరుస్తూ ద‌క్షిణాది భాష‌ల్లో అవార్డ్స్‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నాను… అన్నారు.