సినిమాల ఆదాయం కంటే ఈ ఆదాయమే ఎక్కువ !

‘గ్లామర్ ఇండస్ట్రీ’ ఒక చిత్రమైన ప్రపంచం. ఒకసారి గుర్తింపు తెచ్చుకుంటే చాలు… అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ఇక క్రేజీ స్టార్లు బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకోవచ్చు. బాలీవుడ్‌లో కొందరు స్టార్ హీరోలను తీసుకుంటే వారికి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. తాజాగా ఆ లిస్టులో ఇప్పుడు స్టార్ కిడ్ సారా అలీఖాన్ చేరిపోయింది. సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్‌ల ముద్దుల కూతురైన సారా ‘కేదార్‌నాథ్’ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్‌గా గత ఏడాది ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యంగ్ బ్యూటీ నటించిన రెండో సినిమా ‘సింబా’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది.
దీంతో సారాకు యూత్‌లో క్రేజ్ పెరిగింది. పలు కార్పొరేట్ కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట. సారా తన బ్రాండ్ ప్రమోషన్ డీల్స్ కుదిర్చే కాంట్రాక్ట్‌ను క్వాన్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థలో మన రానా దగ్గుబాటి భాగస్వామి. ఈ సంస్థ వారు సారా కోసం ఇప్పటికే దాదాపుగా 11 కార్పొరేట్ బ్రాండ్స్‌తో ప్రమోషన్ డీల్స్‌ను సెట్ చేశారట. ఈ డీల్స్ ద్వారా సారాకు ఏడాదికి దాదాపుగా రూ. 30 కోట్లకు పైగా సంపాదన ఉంటుందని అంచనా. ఈలెక్కన ఆమెకు సినిమాలతో వచ్చే ఆదాయం కంటే ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ. ఇంత సంపాదించే సారా వయసు ప్రస్తుతం 23 ఏళ్లే. ఇక సినిమాల విషయానికి వస్తే సారా అలీఖాన్ ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్ ‘ఆజ్ కల్’లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘కూలీ నెం.1’ అనే మరో సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది.
 
ఆత్మకు అందంగా కనిపించాలి !
స్టార్ కిడ్స్ కష్టపడరు, వారికి అవకాశాలు ఊరికే వచ్చేస్తాయి… గుర్తింపు కూడా కష్టపడకుండానే వస్తుంది అని కొందరు భావిస్తుంటారు. అటువంటి వారు సారా అలీఖాన్‌ను చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో పైకి కనిపించినంత సులువుగా ఎవరికీ గుర్తింపు రాదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సారా లావుగా ఉండేది . అయితే ఎప్పుడైతే హీరోయిన్ కావాలని నిర్ణయించుకుందో అప్పుడు తన బరువుపై దృష్టి పెట్టి దాదాపు ఏడాదిన్నర పాటు కఠినమైన కసరత్తులు చేసి నాజూకుగా మారింది. లక్కీగా సారా నటించిన మొదటి రెండు సినిమాలు ‘కేదార్ నాథ్’, ’సింబా’లు హిట్ కావడంతో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారింది. అలా అని ఊరికే ఉండకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ… ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ తన సత్తా చాటుతోంది. తాజాగా ఈమె ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. “కంటికి అందంగా కనిపించడం కాదు… ఆత్మకు అందంగా కనిపించాలి’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది సారా అలీఖాన్.