‘కేదార్‌నాథ్‌’ వరదల నేపధ్యంలో సారా అలీఖాన్‌ ప్రేమకధ !

వరదల బీభత్స తాకిడికి 2013లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘కేదార్‌నాథ్‌’ అతలాకుతలమైన విషయం విదితమే. ఈ ఘోర విపత్తులో దాదాపు ఆరు వేల మంది మృత్యువాత పడ్డారు. ఈ వరదల నేపథ్యంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్‌ దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘కేదార్‌నాథ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి ‘లవ్‌ ఈజ్‌ ఈ ప్రిలిగ్రిమేజ్‌’ అనే క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ చిత్ర పోస్టర్‌ను దర్శక, నిర్మాత అభిషేక్‌ కపూర్‌ బుధవారం విడుదల చేశారు.

అభిషేక్‌ కపూర్‌ మాట్లాడుతూ…..’నా గత చిత్రాల మాదిరిగానే ఎంతో ప్యాషన్‌గా ఈ చిత్రకథను రాసుకున్నాను. అత్యంత అద్భుతమైన కేదార్‌నాథ్‌ టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఇందులో సుషాంత్‌సింగ్‌, సారా అలీ ఖాన్‌ ప్రేమ జంటగా నటిస్తున్నారు. టూరిస్ట్‌ గైడ్‌గా సుషాంత్‌, టూరిస్ట్‌గా సారా పాత్రలు ప్రేక్షకుల మదిని దోచేస్తాయని నమ్మకంగా చెప్పగలను. ఇప్పటికైతే ఈచిత్రం గురించి ఇంతే చెప్పగలను. మిగిలింది సినిమానే చెబుతుంది’ అని చెప్పారు. ‘2013లో కేదార్‌నాథ్‌లో వరదలు విలయతాండవం చేశాయి. ఈ ఘోర విపత్తులోనూ సుషాంత్‌, సారాల మధ్య ప్రేమ ఎలా చిగురించింది?, వరదల నుంచి బయటపడి తమని, తమ ప్రేమని కాపాడుకున్నారా లేదా? అనేది ఈ చిత్ర ఇతివృత్తం’ అని బాలీవుడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.