నా యాడ్స్ పాపులారిటీ చూసి, సినిమాల్లో చెయ్యమన్నారు !

సాషా చెత్రి …హీరోయిన్స్‌కి కూడా లేని ఫాలోయింగ్ ఈ అమ్మాయికి ఉంది. సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ ఉంటూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటోంది.ఏ టీవి ఛానల్‌లో చూసినా ఎయిర్‌టెల్ యాడ్ తెగచూపిస్తుంటారు.  ఎయిర్‌టెల్ 4జీ అనగానే మన కళ్ల ముందు ఓ అమ్మాయి ప్రత్యక్షం అవుతుంది కదా! ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా అవకాశం చేజిక్కించుకుంది. అది కూడా ఓ తెలుగు సినిమాలోనే కావడం విశేషం. అవును.. ఎయిర్‌టెల్ అమ్మాయి, 4జీ గర్ల్ అంటూ గుర్తింపు పొందిన డెహ్రాడూన్, ఉత్తరాఖంద్ కి చెందిన సాషా చెత్రి మోడల్, మ్యుజీషియన్, నటి. త్వరలోనే ఓ తెలుగు సినిమాలో కథానాయికగా నటించనుంది. అడవి కిరణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

భాషతో సంబంధం లేకుండా తెలుగులో అడుగుపెట్టడానికి కారణం కథపై ఉన్న నమ్మకమేనని సాషా చెత్రి అంటోంది. అంతేకాకుండా.. తన కెరియర్‌లో తొలి చిత్రం అయినా కూడా ఈ సినిమా లో ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నట్లు చెప్పింది. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో ఇష్టమని సాషా  చెబుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తనకు ఇష్టమేనట.టాలీవుడ్‌లో చాలా మంది ప్రతిభ ఉన్న నటులున్నారని పేర్కొంది. సినిమాల వైపు రావడానికి తనకు ఎయిర్‌టెల్ యాడ్ ఎంతగానో ఉపయోగపడిందని  చెప్పుకొచ్చింది. ఆ ప్రకటనకు సంబంధించిన క్యాంపెయిన్ చాలా ఎక్కువ కాలం సాగిందని, ఈ కారణంగా దేశవ్యాప్తంగా తనను అందరూ గుర్తు పెట్టుకున్నారని తెలిపింది. వాణిజ్య ప్రకటనల తర్వాత తనను నటనవైపు వెళ్లమని చాలా మంది సూచించారని గుర్తుచేసుకుంటోంది.

‘బేషరమ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా తాను ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో దర్శనమిచ్చిన సాషా  అభిమానులను ఇప్పటికే సర్‌ప్రైజ్ చేసింది. ఎయిర్‌టెల్ యాడ్‌లో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అమ్మాయి.. ఈ సాంగ్‌లో కాస్త బోల్డ్‌గా దర్శనమివ్వడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.