‘కొత్త’ ప్రయోగానికి ‘రెట్టింపు’ రెమ్యునరేషన్

శేఖర్ కమ్ముల… ‘డాలర్ డ్రీమ్స్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. ‘ఆనంద్’ చిత్రమే శేఖర్ కమ్ములను ఆడియెన్స్‌కు దగ్గర చేసింది. ఇక ‘హ్యాపీ డేస్’ వంటి విజయాన్నందుకున్న ఈ ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్‌కి.. ఆ తర్వాత ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘అనామిక’ చిత్రాలు ఆశించిన విజయాల్ని అందించలేదు. అయితే ‘ఫిదా’ భారీ విజయం మళ్లీ శేఖర్‌ని ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. రెమ్యూనరేషన్ పరంగా ఎప్పుడూ వార్తల్లో నిలవని శేఖర్ కమ్ముల.. ఇప్పుడు అప్ కమింగ్ మూవీకోసం భారీ మొత్తాన్ని అందుకోబోతున్నాడట. సినిమా బడ్జెట్‌కి రెట్టింపు తన పారితోషికంగా పుచ్చుకుంటున్నాడట.‘ఫిదా’ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల..  నవంబర్‌లో కొత్త సినిమాని ప్రకటించాడు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో దూసుకుపోతున్న ‘ఏషియన్  ఫిలిమ్స్’.. ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి దిగుతోంది. ఇక అంతా కొత్త వాళ్లతో తెరకెక్కే ఈ సినిమా బడ్జెట్‌కి.. రెట్టింపు మొత్తాన్ని పారితోషికంగా అందుకోబోతున్నాడట శేఖర్ కమ్ముల.
కొత్త వాళ్లతో సినిమాలు తీసి విజయాలు సాధించడం శేఖర్ కమ్ములకు అలవాటే. ఈ కోవలోనే న్యూ కమర్స్‌తో తెరకెక్కుతోన్న తన కొత్త చిత్రాన్ని నాలుగు కోట్లు బడ్జెట్ లోనే పూర్తిచేయబోతున్నాడట శేఖర్ కమ్ముల. అయితే ఈ సినిమాని తెరకెక్కించడానికి శేఖర్ కమ్ముల ఏకంగా ఏడు కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతున్నాడట. ‘ఫిదా’ పెద్ద విజయాన్ని సాధించిన నేపథ్యంలో శేఖర్ కమ్ములకు ఈ భారీ మొత్తం అందించడానికి ఏ మాత్రం సంశయించలేదట నిర్మాణ సంస్థ ‘ఏషియన్  ఫిలిమ్స్’