ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి !

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు.. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
 
1946 అక్టోబర్‌ 10న జన్మించిన జయప్రకాశ్‌ రెడ్డి.. 1988లో ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాతో నటుడిగా ఆయన నటుడిగా రంగ ప్రవేశం చేశారు. అంతకు ముందు నుండే ఆయన నాటక రంగంలో రాణించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా తనదైన ముద్ర వేశారు. శత్రువు, లారీ డ్రైవర్‌, బొబ్బిలిరాజా, చిత్రం భళారే విచిత్రం, జంబలకిడి పంబ చిత్రాల్లో నటించారు. ప్రేమించుకుందాం రా సినిమా నటుడిగా ఆయనకు చాలా పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెబుతూ ఆయన చెప్పిన డైలాగ్స్‌ పాపులర్‌ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సమర సింహారెడ్డి విలన్‌గా ఆయన్ని తిరుగులేని స్థాయిలో నిలబెట్టింది. ఆ తర్వాత జయం మనదేరా, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీతయ్య, ఛత్రపతి, గబ్బర్‌సింగ్‌, నాయక్‌, రేసుగుర్రం, మనం, టెంపర్‌, సరైనోడు తదితర సినిమాల్లో నటించారు.ఇలా వరుస చిత్రాలతో తెలుగు,తమిళ, కన్నడ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. నటుడిగా రాణించినప్పటికీ నాటక రంగంతో ఆయన అనుబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. ఆయన పలు స్టేజీలపై మోనో యాక్టింగ్‌ చేసిన ‘అలెగ్జాండర్’‌ నాటకాన్ని సినిమాగా రూపొందించారు. విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో జయప్రకాశ్‌రెడ్డి ఏకపాత్రాభినయం చేస్తూ ‘అలెగ్జాండర్’(ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్‌లైన్‌) పేరుతో ఈ సినిమాను నిర్మించారు.
 
సీనియర్‌ కథానాయకులతో పాటు యువ హీరోలతోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుని తనదైన నటనతో ప్రేక్షకులకు వినోదం పంచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అలరించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. సినిమా పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు.
జయ ప్రకాష్ రెడ్డి గారి మృతి కి ప్రధాని సంతాపం 
జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి!
సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. జయప్రకాశ్‌ రెడ్డిగారితో నేను ఆఖరిగా చేసిన సినిమా ఖైదీ నంబర్‌ 150. ఆయన గొప్ప నటుడు “నాటక రంగం నన్ను కన్నతల్లి. సినిమా రంగం నన్ను పెంచిన తల్లి” అనేవారు. “అందుకే ఇప్పటికీ శని, ఆది వారాల్లో షూటింగ్స్‌ పెట్టుకోనండి. స్జేజ్‌ పెర్ఫామెన్స్‌ ఇస్తుంటాను. మీరెప్పుడైనా రావాలి” అనేవారు. ఆ అవకాశాన్ని నేను పొందలేకపోయాను. సినిమాల్లోరాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ అంటే మొదట గుర్తుకు వచ్చేది జయప్రకాశ్‌ రెడ్డిగారే. తనకంటూ ఓ ప్రత్యేకమైన ట్రెండ్‌ను సృష్టించుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను                      – చిరంజీవి

ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను             – నందమూరి బాలకృష్ణ

జయప్రకాశ్‌ రెడ్డిగారు ఫైన్‌ జెంటిల్‌మేన్‌. ఆయన కటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి                                 – నాగార్జున అక్కినేని

నా స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణంతో షాకయ్యాను. నాది, ఆయనది సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతమైన కాంబినేషన్‌. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం                   – వెంకటేశ్‌

ప్రముఖ నటులు జయప్రకాశ్‌ రెడ్డిగారి మరణం దిగ్ర్భాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. జయప్రకాశ్‌రెడ్డిగారి కటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాయలసీమ మాండలికాన్ని పలకడంలో తనదైన బాణీని జయప్రకాశ్‌రెడ్డిగారు చూపారు. నాటక రంగం నుండి వచ్చిన ఆయన ప్రతినాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. గబ్బర్‌సింగ్‌లో పోలీస్‌ కమీషనర్‌గా ఆయన నటించారు. పాత్ర ఏదైనా చక్కగా ఒదిగిపోయేవారు. చిత్ర రంగంలో ఎంత బిజీగా ఉన్నా, నాటక రంగాన్ని మాత్రం మరువలేదు. తెలుగు సినీ, నాటక రంగాలకు జయప్రకాశ్‌రెడ్డిగారి మరణం తీరని లోటు                                                                                                   -పవన్‌కల్యాణ్‌

జయప్రకాశ్‌ రెడ్డిగారు చనిపోవడం చాలా బాధాకరం. అయనొక అద్భుతమై నటుడు, కమెడియన్‌. ఆయనతో కలిసి  పనిచేసిన క్షణాలను మరచిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను                        – మహేశ్‌ 

అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను        –  తారక్‌