ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూశారు!

ప్రముఖ నటి గీతాంజలి (62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి.
తూ.గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన ‘సీతారామ కళ్యాణం’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు… వంటి హిట్‌ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు. తరువాతి కాలంలో క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు.. తదితర చిత్రాల్లో నటించారు. కాగా, గీతాంజలి చివరిగా తమన్నా కథానాయికగా రూపొందుతున్న ‘దటీజ్‌ మహాలక్ష్మి’లో నటించారు. గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.
 
రామ‌కృష్ణ‌గారితో పెద్ద‌లు కుదిర్చిన వివాహం
న‌టిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి ఓ సారి త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేశారు… “మా ఆయ‌న రామ‌కృష్ణ‌గారు కూడా యాక్ట‌ర్ అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇద్ద‌రం సినిమా రంగానికి చెందిన‌వాళ్ళం కాబ‌ట్టి …చాలా మంది మాది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ మాది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. రామ‌కృష్ణ‌గారు మా నాన్న‌ను కాకా ప‌ట్టి న‌న్ను పెళ్లి చేసుకున్నారు. రామ‌కృష్ణ‌గారి గుణ‌గ‌ణాలు న‌చ్చ‌డంతో… `అబ్బాయి మంచి అంద‌గాడు. డీసెంట్ బిహేవియ‌ర్‌` అని నాకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరి చిత్రాల్లో నేనూ, రామకృష్ణగారు కలిసి నటించాం`అన్నారు గీతాంజ‌లి.