త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెలిపే `స‌త్య గ్యాంగ్‌`

సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేశ్‌ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘ సత్య గ్యాంగ్‌స‌. ఈ సినిమా ఏప్రిల్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ – “సాధార‌ణంగా పుట్టుక‌తో అనాథ‌లుగా ఉండే వారికి, పుట్టిన త‌ర్వాత అనాథ‌లుగా మారే వారికి ఈ సోసైటీలో గుర్తింపు ఉండ‌దు. అటువంటి వారిని ప‌ట్టించుకోక‌పోతే వారు నేర‌స్థులుగా మారే అవ‌కాశం ఉంది. స‌త్యగ్యాంగ్‌` చిత్రం అనాథ‌ల‌కు సంబంధించిన క‌థ‌తో సాగే చిత్రం. ఇందులో నేను అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ పాత్ర‌లో న‌టించాను. మాన‌వ అవ‌యవాల‌ను దొంగిలించి రవాణా చేసే ఓ ముఠా.. వారిని ప‌ట్టుకునుందుకు పోలీసులుగా మేమేం చేశామ‌నేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం. క‌ర్నూలుకు చెందిన మ‌హేశ్ ఖ‌న్నాగారు నిర్మాత‌గానే కాకుండా ఇందులో మంచి పాత్ర‌లో కూడా న‌టించారు. అలాగే సుహాసినిగారు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. క‌ర్నూలు ద‌గ్గ‌ర‌లోని డోన్ వ‌ద్ద ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. అలాగే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ సినిమాను తెర‌కెక్కించ‌డ‌మే కాదు.. మంచి సంగీతాన్ని కూడా అందించాడు. సినిమాలో అనాథ‌ల‌పై అద్భుత‌మైన సాంగ్ ఉంది. దాన్ని చంద్ర‌బోస్ గారు రాశారు. త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే చిత్ర‌మిది. హీరో సాత్విక్ ప‌ది సినిమాల అనుభ‌వ‌మున్న హీరోలా చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు హీరోగా మంచి భ‌విష్య‌త్ ఉంది“ అన్నారు.
నా వంతు స‌హ‌కారాన్ని అందించ‌డానికి  సిద్ధ‌మే !
రాజ‌కీయాల గురించి సుమ‌న్‌ మాట్లాడుతూ …“జై తెలంగాణ ఉద్య‌మానికి ముందు మ‌ద్ధ‌తు ప‌లికిన న‌టుల్లో నేనే మొద‌టివాడిని. నేను హైద‌రాబాద్ వ‌చ్చి 29 ఏళ్ల‌వుతుంది. కె.సి.ఆర్‌గారు సీ.ఎం. అయిన త‌ర్వాత ఆయ‌న చేస్తున్న మంచి ప‌నులు.. తెలంగాణ అభివృద్ధి నన్ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ముస్లింని, ద‌ళితుడిని డిప్యూటీ సీఎం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఆయ‌న‌కు నా వంతు స‌హ‌కారాన్ని అందించ‌డానికి నేను ఎప్పుడూ సిద్ధ‌మే. అయితే తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా చేయాల‌ని మాత్రం ఆయ‌న్ను కోరుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత‌ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌లిసి జీవిస్తున్నారు. అలాగే ప్ర‌త్యేక హోదాకు నా మ‌ద్ధ‌తు ఉంటుంది. అయితే హోదా వ‌ద్దు స్పెష‌ల్ ప్యాకేజ్ కావాలనుకున్న స‌మ‌యంలో మోడీతో చంద్ర‌బాబుగారే మాట్లాడారు. అలాగే.. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కావాలంటున్నారు. అస‌లు ప్ర‌త్యేక హోదా వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు కలిగే లాభాలంటే తెలియ‌జేస్తేనే క‌దా! వారికి ప్ర‌త్యేక హోదా కావాలో.. ప్ర‌త్యేక ప్యాకేజీ కావాలో నిర్ణ‌యం తీసుకునేది“ అన్నారు.