సీనియర్ దర్శకులు ఈరంకి శర్మ మృతి

రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, వంటి వారితో సినిమాలు తెరకెక్కించిన దర్శకులు ఈరంకి శర్మ (93) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మచిలీపట్నంకి చెందిన ఈరంకి శర్మ తన తండ్రి చనిపోవడంతో చెన్నైకి వెళ్లారు. తన సోదరుడు దర్శకత్వం వహించిన ‘చిన్నమ్మ కథ’ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారాయన. వేదాంతం రాఘవయ్య, కె.బాలచందర్‌ సినిమాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా చేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు ఎడిటర్‌గానూ చేశారు.

1977లో రజనీకాంత్‌ నటించిన ‘చిలకమ్మ చెప్పింది’తో దర్శకునిగా మారారు. ఆ సినిమాకి బంగారు నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రం కూడా బంగారు నంది గెల్చుకుంది. చిరంజీవి, మాధవిలతో ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ సినిమా తీశారు. ఆ తర్వాత ‘అగ్నిపుష్పం, సీతాదేవి’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. తమిళ సినిమాలూ చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమకి వెళ్లాక తెలుగు సినిమాలు తగ్గించేశారాయన. ఈరంకి శర్మకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఈరంకి శ‌ర్మకు చిరంజీవి నివాళులు

కాగా  ఈరంకి  మృతి పట్ల  చిరంజీవి ఆయ‌న కుటుంబానికి అమెరికా నుంచి ఫోన్ సందేశం ద్వారా  ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఒక నెల రోజుల క్రిత‌మే ఆయ‌న ఫోన్ చేసి త‌న మ‌న‌వ‌రాలి పెళ్లికి త‌ప్ప‌కుండా రావాల‌ని న‌న్ను ఆహ్వానించారు. కానీ విధికి ఎవ‌రూ అతీతులు కారు. ఆయ‌న మ‌ర‌ణం న‌న్ను ఎంతగానో బాధించింద‌ని చిరంజీవి సంతాపాన్ని వ్య‌క్తం చేసారు