జనాలు ఇంకా నన్ను ప్రేమిస్తుండటం ఆశ్చర్యకరం!

”మేం మంచి చిత్రాలు తీయలేదు. అందుకే అవి విజయవంతం కాలేదు. భారత్‌లో క్రికెట్ ఆడటం.. సినిమాలు తీయడం అందరికీ తెలుసు. సచిన్‌కు బ్యాటింగ్ లాగే.. నాకు కథ చెప్పడం ఎలాగో కూడా కొందరు నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను…నా సినిమాల్లో కథను సరిగ్గా చెప్పలేకపోయాము. అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నేను వినయంతో ఈ విషయం చెప్పట్లేదు.. నిజాయితీగా చెబుతున్నా” అని షారుఖ్ ఖాన్ అన్నారు. బీబీసీ వ్యాఖ్యాత టామ్ బ్రూక్స్‌కు షారుఖ్ ఖాన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడారు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’తో భారీ విజయం సాధించిన తర్వాత ఆరేళ్లలో షారుఖ్ హీరోగా ఏడు సినిమాల్లో నటించారు. వాటిలో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించ లేదు.
 
రెండేళ్లుగా తన సినిమాలు సరిగ్గా ఆడలేకపోవటానికి కారణం.. తాను కథను సరిగ్గా చెప్పలేకపోవడమేనని షారుఖ్ ఖాన్ అన్నారు.కథలను ప్రతిసారీ గొప్పగా చెప్పలేమని, కొన్ని సార్లు అందులో విఫలం అవుతుంటామని షారుఖ్ అన్నారు. ప్రేక్షకులు తనకు బాస్ లాంటివారని, తాను వారి ఉద్యోగినని.. బాస్‌ను సంతృప్తిపరచలేనప్పుడు తన ఉద్యోగం ఊడుతుందని అన్నారు. గత రెండేళ్లుగా నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే, ప్రేక్షకులు నాకు తిరిగి అవకాశం ఇస్తారు. నేను మళ్లీ వస్తా. నా బాస్‌ను మచ్చిక చేసుకుంటా’’ అని చెప్పారు.
 
‘ప్రజల్లో తనకు ఇంత ఆదరణ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని షారుఖ్ అన్నారు.’ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఇది నా ఊహకు అందదు. ‘నాకే ఎందుకు ఇలా జరిగింది, వేరే ఎవరికో ఎందుకు కాదు’ అన్న విషయం ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు గడిచినా, జనాలు ఇంకా నన్ను ప్రేమిస్తుండటం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది” అని చెప్పారు.
 
మనసినిమా కథను చెప్పే పద్ధతిలో .. పాటలు, నృత్యం వారసత్వంగా భాగమయ్యాయని, మన సినిమాల్లో పాటలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని షారుఖ్ అన్నారు.
 
ఆస్కార్ పురస్కారాలకు భారతీయ సినిమాలను ఎంపిక చేసే పద్ధతిలో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు… ”మనం భారత్ నుంచి ఆస్కార్స్‌కు పంపేందుకు ఏదో ఒక సినిమా అత్యుత్తమమని భావించి ఎంపిక చేస్తాం. కానీ, చాలా సార్లు అది అత్యుత్తమం కాదు, ఎందుకంటే.. ఆస్కార్ కు తగిన విధంగా వాటిని మనం ఎంపిక చేయడం లేదు. సినీ దర్శకులు, సంఘాలు ఆస్కార్ ఏం ఆశిస్తుందో అర్థం చేసుకోవాలి” అని అన్నారు.
 
ఫెయిర్‌నెస్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా విమర్శలపై షారుఖ్ స్పందించారు… ‘అలాంటి ఉత్పత్తులను ఎందుకు ఎంచుకుంటారని అప్పుడప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వారికి నేనెప్పుడూ ఒకటే చెబుతుంటా. ఆ ఉత్పత్తులే నన్ను ఎంచుకుంటాయి. నేను వాటిని ఎంచుకోను. అవి చట్టబద్ధమైనవే కదా” అని అన్నారు.
 
‘మీటూ’ ఉద్యమం భారత్‌లోనూ చాలా మార్పు తెచ్చిందని షారుఖ్ అభిప్రాయపడ్డారు….’సినీ, మీడియా ప్రపంచం ఇప్పుడు మేల్కొంది. అనుచితంగా ప్రవర్తిస్తే, దానికి పర్యవసానాలు ఖటినంగా ఉంటాయన్న విషయం జనాలకు అర్థమైంది” అని అన్నారు.
 
భవిష్యత్తు తరాలకు ఏం ఇవ్వాలనుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు.. ‘బాగా కష్టపడే గుణం, వినోదం కలిసిన పని సంస్కృతిని ఇవ్వాలనుకుంటున్నానని, అప్పుడే జీవితంలో అలసిపోకుండా ఉండగలుగుతారని ఆయన అన్నారు. విజయాన్ని టీషర్ట్‌లా క్యాజువల్‌గా ధరించాలని సూచించారు.