కూతురి పెళ్లి ఖర్చులానే.. సినిమాల ఖర్చు కూడా…

‘బాలీవుడ్‌ బాద్షా’ షారుక్‌ ఖాన్‌… ప్రతి సినిమా తనకు కూతురులాంటిదని అంటున్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌. ఆయన నటించిన ‘జీరో’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ విషయం గురించి షారుక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు… “నేను సాధించలేనేమో అనుకున్న విషయాల్లో విజయం సాధించేశాను. మన జీవితాలకు మనమే రాజు అనుకున్నప్పుడు మనకు నచ్చింది చేసుకుంటూ పోవాలి. ప్రతి సినిమా నాకు కూతురితో సమానం. కూతురి పెళ్లిళ్లను ఎంతో ఖర్చుపెట్టి ఘనంగా చేస్తారు. అలాంటప్పుడు సినిమాలకు ఎందుకు ఖర్చుచేయకూడదు’ అని అన్నారు షారుక్‌.
 
ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ‘జీరో’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ కథానాయికలుగా నటించారు. డిసెంబర్‌ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. దాంతో షారుక్‌ ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ బయోపిక్‌ చిత్రీకరణను రెండు నెలల ముందే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారట. ఈ సినిమాకు ‘సెల్యూట్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
నమ్మినన్ని రోజులు మరిన్ని సినిమాలు
వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నారు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌. ఆయన నటించిన ఫ్యాన్‌, రాయిస్‌, దిల్‌వాలే వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో షారుక్‌ హీరోగా వచ్చిన ‘జబ్‌ హ్యారి మెట్‌ సెజల్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 64. 33 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వరుస పరాజయాలు పలకరిస్తున్నప్పటికీ షారుక్‌ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘జీరో’. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందు ఓ ఇంగ్లీష్‌ పత్రికతో మాట్లాడిన షారుక్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు….
“భారీ హిట్‌ కొట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. మళ్లీ అలాంటి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నాను.. కానీ కుదరడం లేద’ని అన్నారు. రిలీజ్‌ కాబోతున్న ‘జీరో’ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఫలితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. దాన్ని నేను మార్చలేను కూడా. మరి మార్చడానికి కుదరని అంశాల గురించి నేను ఎందుకు ఆలోచించాలి’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘జీరో చిత్రం షారుక్‌ కెరీర్‌కి చాలా ముఖ్యమైంది.. కచ్చితంగా విజయం సాధించాలని జనాలు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్‌ అయ్యిందనుకొండీ.. అప్పుడు మహా అయితే ఓ 6 – 10 నెలల పాటు నేను సినిమాలు చేయను. కానీ నా నైపుణ్యం, కళ మంచివని నమ్మినన్ని రోజులు మరిన్ని సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని షారుక్‌ చెప్పారు.