స్టార్ హీరో సతీమణి హీరోయిన్ అవుతోంది !

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌ సినీరంగ ప్రవేశం చేయబోతోంది. సిద్ధార్థ మల్హోత్రా సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది.

ప్రఖ్యాత ఆంగ్ల రచయిత డీహెచ్‌ లారెన్స్‌ రచించిన ‘లేడీ చార్లెస్ లవర్‌’  నవల ఆధారంగా హిందీలో తెరకెక్కబోతున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తారని వినిపిస్తోంది. తాజాగా ‘పద్మావత్‌’ సినిమాతో మెప్పించిన సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

నేహా ధూపియా టాక్‌షోలో పాల్గొన్న మీరా భన్సాలీతో కలిసి పనిచేయాలని ఉందని పేర్కొంది. అదే షోలో మాట్లాడిన షాహిద్‌ కూడా మీరాకు సిద్ధార్థ మల్హోత్రా నటన అంటే ఇష్టమని తెలిపాడు.

భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు భావిస్తున్న ఈ  ప్రాజెక్టులో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆంగ్ల సాహిత్య విద్యార్థి కావడంతో లారెన్స్‌ రచనల గురించి, తాను చేయబోయే పాత్ర గురించి ఆమెకు పూర్తిగా తెలుసునని సన్నిహితులు తెలిపారు. ఈ సినిమాలో షాహిద్‌ కూడా అతిథి పాత్ర పోషించే అవకాశముందట. మొత్తానికి మీరా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నదని, భన్సాలీ సినిమాతో ఆమె ఆరంగేట్రం చేస్తుండటం తనకు ఆనందం కలిగిస్తోందని షాహిద్‌ చెప్పాడు.