శ్ర‌ద్ధా, సోన‌మ్ క‌పూర్ ల పెళ్లి పై తండ్రుల స్పందన

ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో సుజీత్ తెర‌కెక్కిస్తున్న ‘సాహో’ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది శ్ర‌ద్ధా క‌పూర్‌.  బాలీవుడ్‌లో సైనా నెహ్వాల్ బ‌యోపిక్‌తో పాటు బ‌త్తీ గుల్ మీట‌ర్ చాలూ, స్త్రీ చిత్రాలు చేస్తుంది. అయితే రీసెంట్‌గా లెహంగా ధ‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్ర‌ద్ధా వాటికి అతి పెద్ద వేడుక కోసం అని కామెంట్ పెట్టింది. దీంతో నెటిజ‌న్స్ అంద‌రు శ్ర‌ద్ధా కూడా పెళ్ళి చేసుకోబోతుందా? అంటూ చ‌ర్చ‌లు కొన‌సాగించారు. దీనిపై అల‌నాటి న‌టుడు, శ్ర‌ద్ధా తండ్రి శ‌క్తి కపూర్ స్పందించారు….

“ఏ తండ్రైన కూతురు మంచి వ్య‌క్తిని చేసుకొని పెద్ద కుటుంబంలోకి వెళ్లాల‌నుకుంటాడు. నా కోరిక అదే. ఈ రోజుల‌లో పెద్దోళ్ళు సంబంధాలు చూసి పెళ్ళి చేసే రోజులు పోయాయి. కాలానికి అనుగుణంగా మారాల‌నేదే నా ఆలోచ‌న కూడా. పెళ్లి విష‌యం త‌న‌కే వ‌దిలేస్తున్నాను. కెరీర్‌ప‌రంగా, జీవితం ప‌రంగా మంచి పొజీష‌న్‌లో ఉండాల‌నేదే నా ఆశ‌. ప్ర‌స్తుతం తాను వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. టైం వ‌చ్చిన‌ప్పుడు త‌న‌కి న‌చ్చిన వాడితో ఏడ‌డుగులు వేస్తుంది. ఈ విష‌యంలో మాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు” అని శ‌క్తి క‌పూర్ అన్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో సోన‌మ్ క‌పూర్ -ఆనంద్ ఆహుజా, ర‌ణ్‌వీర్‌- దీపికల పెళ్లికి సంబంధించిన వార్త‌లు అభిమానుల‌లో ఆస‌క్తిని క‌లిగిస్తుంటే ఇప్పుడు శ్ర‌ద్ధా ఎవ‌రిని చేసుకోనుంది అనే దానిపై సస్పెన్స్ నెల‌కొంది.

సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే… 

అనిల్‌ కపూర్‌ గారాలపట్టి సోనం కపూర్‌, ఢిల్లీ కుబేరుడు ఆనంద్‌ అహుజాల వివాహం మే 8న ముంబయిలో అట్టహాసంగా జరుగుతుందన్న వదంతులపై అనిల్‌ కపూర్‌ స్పందించారు…. సోనం వివాహానికి సంబంధించి త్వరలోనే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సంగీత్‌, మెహందీ ఎప్పుడు జరుగుతుంది..పెళ్లి వేడుకలు ఎలా ప్లాన్‌ చేశారనే దానిపైనా సస్పెన్స్‌ కొనసాగుతున్నాయి. ఈ విషయమై సోనం, ఆనంద్‌ అహుజాలు నోరుమెదపడం లేదు. అనిల్‌ కపూర్‌ ఇల్లును ముస్తాబు చేస్తుండటంతో వివాహ తంతుపై మరింతగా వార్తలు గుప్పుమన్నాయి.

కాగా, తమ కెరీర్‌ ప్రారంభం నుంచి మీడియా తమకు అండగా నిలుస్తోందని..సరైన సమయంలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. తన పెళ్లి వేడుకలపై ఇటీవల సోనం మీడియాతో మాట్లాడుతూ…. వివాహ వేడుకలకు రూ లక్షలు దుబారా చేయడం తనకిష్టం లేదని ఇంట్లోనే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుందని చెప్పిన విషయం తెలిసిందే