బాలీవుడ్ కోలీవుడ్‌లో బిజీ బిజీ !

షాలిని పాండే… విజయ్ దేవరకొండను స్టార్‌ను చేసిన ‘అర్జున్‌రెడ్డి’ని యూత్ ఇప్పట్లో మరచిపోరు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన షాలిని పాండే తెలుగులో ఆతర్వాత పెద్దగా కనిపించలేదు. ‘మహానటి’లో సావిత్రి స్నేహితురాలిగా చేసిన చిన్న పాత్ర వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. అయితే షాలిని పాండేకు కోలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. వరుసగా తమిళ సినిమాలు చేస్తూ ఈ భామ బిజీగా ఉంది. బాలీవుడ్ ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.

అయితే ఆమె ఈ ఏడాది హిందీలో చేసిన ‘మేరీ నిమ్మో’, ‘హెలికాప్టర్ ఈలా’ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం షాలిని పాండే మంచి స్వింగ్‌లో ఉంది. తెలుగులో నాగచైతన్యకు పెద్ద హిట్‌నిచ్చిన ‘100% లవ్’ తమిళ్ రీమేక్‌లో ఆమె జివి ప్రకాష్ సరసన నటిస్తోంది. దీని షూటింగ్ చివరి దశలో ఉంది. ‘గొరిల్లా’ అనే మరో సినిమాలో ‘రంగం’ హీరో జీవా సరసన షాలిని నటిస్తోంది. ‘అగ్ని సిరగుగల్’ అనే తమిళ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘జ్వాలా’ పేరుతో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన చేసిన ‘118’ చిత్రం జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.