రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయ్యా !

తన ‘సినీరంగ ఆరంభం’ బాధాకరమే  అంటోంది నటి శాలిని పాండే. తెలుగు చిత్రం ‘అర్జున్‌రెడ్డి’తో ఈ నటి పేరు మారుమోగిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్ర షూటింగ్‌లోనే నరకయాతన అనుభవించానంటోందీ భామ.తారల ఆరంభ జీవితాలు బాధాకరంగా, అయ్యో పాపం అనేంతగా ఉంటాయనిపిస్తాయి. కొందరైతే లైంగిక వేధింపులు, ప్రేమలో విఫలం వంటి దుస్థితులకు గురైన వారై ఉంటారు. అలా ఈ మధ్య ‘మహానటి’ చిత్రంలో మెరిచిన శాలినిపాండేకు ప్రస్తుతం కోలీవుడ్‌లోనే అవకాశాలున్నాయి. యువ నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ‘100% లవ్’, జీవాతో ‘గొరిల్లా’ చిత్రాల్లో నటిస్తోంది.

తన సినీరంగప్రవేశం గరించి శాలినిపాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ…. తాను సినిమాల్లో నటించడానికి తన తల్లిదండ్రులు వ్యతిరేకించారని చెప్పింది.ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం చూసుకోమని ఒత్తిడి చేశారని అంది. తాను పట్టుబట్టి రంగస్థల నటిగా మారానని, ఆ తరువాత సినిమా అవకాశాల కోసం ఇంట్లో గొడవ పడి ముంబై వచ్చేశానని తెలిపింది. అప్పుడు తన తండ్రి శాపనార్థాలు కూడా పెట్టారని చెప్పింది. ఇకపోతే ముంబైలో ఒంటరి అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఇల్లు అద్దెకు ఇవ్వరని తెలిపింది. దీంతో తాను మరో అమ్మాయితో కలిసి ఇద్దరు అబ్బాయిలు ఉంటున్న ఇంట్లో అద్దెకు ఉన్నానని చెప్పింది. ఆ అబ్బాయిలు చాలా మంచి వాళ్లని, తనతో ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదని అంది.వారి సాన్నిహిత్యంలో కొత్త లోకాన్ని చూశానని పేర్కొంది.

‘అర్జున్‌రెడ్డి’ చిత్రం సంచలన విజయం సాధించి తనకు మంచి పేరు తెచ్చి పెట్టడంతో తన కుటుంబ సభ్యులు తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పింది. తన జీవితంలో కళాశాలలో చదువుతున్న సమయంలో, సినిమాకు పరిచయం అయిన తరువాత రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయ్యానని చెప్పింది. దీంతో ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ ప్రేమ వైఫల్యంతో బాధ పడ్డానని చెప్పింది. అదే సమయంలో ఆ చిత్ర హీరోతో సన్నిహిత సన్నివేశాల్లో నటించల్సి వచ్చినప్పుడు నరకయాతన అనుభవించానని శాలినిపాండే చెప్పింది.