శంకర్ ముందు ‘భారతీయుడా’ ? రామ్ చరణా ?

‘విశ్వనటుడు’ కమల్‌హాసన్, సంచలన  దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న`భారతీయుడు-2`ను ఆది నుంచి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దర్శకుడికి, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య తలెత్తిన ఆర్థిక విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు`భారతీయుడు-2` ఆగిపోయినట్టేనా?`భారతీయుడు-2`ను పక్కన పెట్టేసి రామ్‌చరణ్ చిత్రాన్ని శంకర్ ప్రారంభించబోతున్నారా? 

ముందుగా అంగీకరించిన బడ్జెట్ లో చెయ్యడానికి లైకా నిర్మాణ సంస్థ వెనుకాడటంతో ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ రాజీ పడడంతో మళ్లీ పట్టాలెక్కింది. ఆ తర్వాత షూటింగ్ స్పాట్‌లో  భారీప్రమాదం జరిగి సహాయకులు చనిపోయారు. పోలీసు కేసుల వరకూ వెళ్లింది. ఇక, ఆ తర్వాత కరోనా వచ్చి పడింది. 9 నెలల నుంచి సినిమా షూటింగ్ అన్నదే లేదు. లాక్‌డౌన్ ఎత్తేశాక కూడా ఈ చిత్రబృందం నుంచి ఎలాంటి కదలికా లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక, శంకర్ రామ్‌చరణ్‌తో సినిమా ప్రకటించాక `భారతీయుడు-2`పై సందేహాలు మరింత పెరిగాయి. `భారతీయుడు-2`ని పక్కన పెట్టేసి చెర్రీ సినిమాను శంకర్ ప్రారంభిస్తున్నారని అంతా అనుకుంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం `భారతీయుడు-2` షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోందట. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం మిగిలిన షూటింగ్‌ను కూడా పూర్తి  చేసిన తర్వాతే శంకర్ తన తర్వాతి సినిమా పనులను ప్రారంభిస్తారట. `భారతీయుడు-2`లో కమల్‌తోపాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, వివేక్ తదితరులు నటిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రామ్‌చరణ్ ?…  ప్రస్తుతం ప్యాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో బిజీగా ఉన్న ‌రామ్‌చరణ్‌, తన తదుపరి చిత్రాన్ని కూడా ప్యాన్‌ ఇండియా మూవీగానే చేస్తున్నాడు. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ ప్యాన్‌ ఇండియా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టార్‌ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా జోనర్‌ ఏంటనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనుందంటూ వార్తలు  హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని శంకర్‌ అప్పుడెప్పుడో చెప్పేసినట్లు మెగా ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ‘ఇండియన్‌ 2’ తర్వాత తాను ఓ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కథను సిద్ధం చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను మెగా ఫ్యాన్స్ రీ ట్వీట్ చేస్తుండటం విశేషం.శంక‌ర్ సినిమాతో పాటు రామ్‌చ‌ర‌ణ్ మ‌రో ద‌ర్శ‌కుడికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఆ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి. తెలుగులో నాని `జెర్సీ` హిట్ కొట్టిన గౌత‌మ్ తిన్న‌నూరి ఇప్పుడు బాలీవుడ్‌లో `జెర్సీ` సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ స్క్రిప్ట్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి వ‌ర్క్ చేస్తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.