స్టార్‌ జీవితం అంతే.. ఒక్క రోజులో పడిపోవచ్చు !

షారుఖ్‌ ఖాన్‌… ” నేను ఫోర్బ్స్‌ మేగజైన్‌ అత్యధిక ధనవంతుల జాబితాలో కిందికి పడిపోయినట్టు మూడు రోజులుగా వింటున్నా. ట్విట్టర్‌లో ప్రియమైనవాడిని అయ్యాను. ఫోర్బ్స్‌ సర్వే ప్రకారం పేదవాడ్ని అయ్యాను. నా సినిమా(‘జీరో’)తో పై స్థానానికి దగ్గరవుతాను. స్టార్‌ జీవితం అంటే అంతే. ఒక్క రోజులోనే ప్రియమైనవారవుతారు.  ఒక్క రోజులోనే పేదవారు అవుతారు” అని షారుఖ్‌ ఖాన్‌ అన్నారు.
షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, శ్రీదేవి నటించిన చిత్రం ‘జీరో’. ఇందులో షారుఖ్‌ మరుగుజ్జు వ్యక్తిగానూ, అనుష్క శర్మ పక్షవాతంతోనూ బాధపడుతున్న యువతిలా కనిపించనున్నారు. ఇటీవల ఫోర్బ్స్‌ విడుదల చేసిన ఇండియన్‌ సెలబ్రిటీస్‌ జాబితాలో షారుఖ్‌ ఖాన్‌కు 13వ స్థానం లభించింది. ఎందుకంటే ఆయన గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకూ చేసిన సినిమా లేవు. ఈ ఆదాయం కూడా ఆయన కొన్ని ప్రకటన సంస్థలకు అంబాసిడర్‌గా ఉండడంతో ఆర్జించినవే. గత ఏడాది మాత్రం రెండో స్థానంలో నిలిచారు.
కానీ ఈ ఏడాది ట్విట్టర్‌లో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తుల్లో దేశంలో మొదట పది మందిలో ఈయన కూడా నిలిచారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ పేర్కొంది. ఫోర్బ్స్‌ ఈ జాబితాను విడుదల చేసిన సమయంలో షారుఖ్‌ దుబాయిలో ‘జీరో’ చిత్రం ప్రమోషన్‌ పనుల్లో ఉన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యారు. ఆ ప్రమోషన్‌కు సంబంధించిన వీడియోలను ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు షారుఖ్‌.
ఆ పాటకు సుహానా సాయం చేసింది
‘జీరో’ చిత్రంలో “మేరే నామ్‌ తు..” అనే గీతం ఉంది. ఈ గీతానికి సాహిత్యం సరిగ్గా ఉండేటట్టు తన కుమార్తె సుహాన్‌ ఖాన్‌ సహకారం అందించిందని షారుఖ్‌ పేర్కొన్నారు. ఆ విషయాన్ని బాద్‌షా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొన్నాడు. ‘జీరో’ సెట్‌లో సుహానాతో షారుఖ్‌ దిగిన ఓ ఫొటో షేర్‌ చేస్తూ ” మేరే నామ్‌ తు ..” అనే గీతానికి సంబంధించి అన్నీ పూర్తి చేసేశాను. చాలా బాగుంది. సెట్స్‌లో సరైన సాహిత్యం వచ్చేలా మా అమ్మాయి నాకు బోధించింది. తర్వాత తనే ఈ గీతం బాగుందని ఆమోదించింది” అని పేర్కొన్నారు. అనుష్క శర్మ, షారుఖ్‌ మధ్య సాగే ఈ గీతం మేకింగ్‌ వీడియోను కూడాను కూడా షేర్‌ చేశారు. ఈ పాటకు అజరు అతుల్‌ స్వరాలు సమకూర్చారు. రెమో డిసౌజ్‌ కొరియోగ్రఫీ అందించారు.