పీకల్లోతున కూరుకుపోయిన బాలీవుడ్ బాద్షా

ఉన్నదానితో తృప్తిపడితే ఎవరికీ ఎలాంటి గొడవా ఉండదు. సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా కావాలనుకోవడం దగ్గరే వస్తుంది అసలు చిక్కు. ఇప్పుడు అలాంటి చిక్కులు తెచ్చిపెట్టే లెక్కల దగ్గరే దొరికిపోయాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నఈ సూపర్ స్టార్ ఇప్పుడు అక్రమాస్తుల కేసులో పీకల్లోతున కూరుకుపోయాడన్నది బిటౌన్ సమాచారం. ఫోర్జరీ కేసులో ఆధారాలతో పట్టుబడ్డ అతగాడి భవిష్యత్తుపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

 షారూఖ్‌ఖాన్ ఆ మధ్య డెజావు పార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అలీబాగ్‌లో దాదాపు 20వేల గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. నిజానికి అలా కొనడాన్ని ఎవరూ తప్పు పట్టరు. దండిగా పైసలున్న ఎవరయినా ఆ పనిచేస్తారు. కానీ షారూఖ్ ఖాన్ అలా రాజమార్గంలో కొని ఉంటే ఏ గొడవ ఉండకపోను. బినామి పేర్లతో ఈ పనిచేశాడు.అంతేకాదు ఇందుకోసం నకిలీ పత్రాల్ని సృష్టించాడనే ఆరోపణలూ వచ్చాయి. దానికి సంబంధించిన ప్రాధమిక రుజువులు ఉండటంతో ఐ.టీ. అధికారులు అలీబాగ్ లోని ఇరవై వేల గజాల స్థలాన్ని అటాచ్ చేసింది. ఇంతకాలం షారూక్ పక్కనే ఉన్న ఓ సన్నిహితుడే ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి బాలీవుడ్ బాద్ షాను ఈ కేసులో ఇరికించాడనే పుకార్లు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి.
షారుక్ ఖాన్ వ్యవసాయం కోసం కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను విలాసాల కోసం వినియోగిస్తున్నాడనే ఆరోపణ కూడా ఉంది. ఇక్కడ ఫామ్ హౌస్‌తో పాటు, స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ హెలీపాడ్, ఆర్టిఫిషియల్ బీచ్ లాంటివి షారుక్ ఏర్పాటు చేసుకున్నాడట. ఈ ప్రాపర్టీకి తన బంధువుల్ని డైరెక్టర్లుగా నియమించినా, సర్వాధికారాల్ని తనే ఉంచుకున్నాడట. ఈ ఆస్తి రేటు రూ.15 కోట్లు కాగా మార్కెట్ విలువ దానికి ఐదు రెట్ల వరకూ ఉంటుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. అయితే షారుక్ ఖాన్ దగ్గర చార్టర్డ్ అకౌంటెంట్‌గా గతంలో పనిచేస్తున్న మోరేశ్వర్ ఆజ్గాంకర్ పేరు ఈ మొత్తం వ్యవహారంలో బాగా వినిపిస్తోంది. షారూఖ్‌ను ఇరుకున పెట్టేలా, ఈ విషయాన్ని ఐటీ అధికారులకు అతగాడే ఉప్పందించాడట. అంతేకాదు అలీబాగ్ ప్లాట్లను నకిలీ పత్రాలతో షారుఖ్ సూచనలతోనే కొనుగోలు చేసినట్టు మోరేశ్వర్ ఐటీ అధికారుల ముందు ఒప్పుకున్నాడనీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి నేరం రుజువైతే షారుక్‌కు ఆరు నెలల నుండీ ఏడేళ్ళ వరకూ శిక్ష పడే ఆస్కారం ఉందని తెలుస్తోంది.