షారూఖ్‌,కంగనా : బాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ !

షారూఖ్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌ తొలిసారి వెండితెరపై మ్యాజిక్‌ చేయబోతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై వండర్స్‌ క్రియేట్‌ చేసిన దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంతో తెరకెక్కబోయే ఓ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కంగనా వెల్లడించడం విశేషం. షారూఖ్‌కి జోడీగా తనను తీసుకోవాలని భన్సాలీ భావించడం ఎంతో సంతోషంగా ఉందని కంగనా తెలిపారు. భన్సాలీ తొలుత షారూఖ్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్‌ చేశారు. దీని కోసమై షారూఖ్‌తోనూ భన్సాలీ కథా చర్చలు జరిపారు. డేట్స్‌ షారూఖ్‌ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ కాలేదు.

భన్సాలీ తాజాగా చెప్పిన ఓ కథ షారూఖ్‌కి బాగా నచ్చడంతో దీన్ని ట్రాక్‌ ఎక్కించమని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఈ ప్రాజెక్ట్‌ విషయమై భన్సాలీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా షారూఖ్‌ సరసన కంగనాని ఎంపిక చేశారు. ఆమెతోపాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం సెట్‌ అయితే సాధ్యమైనంత త్వరలోనే షూటింగ్‌కి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కంగనా ప్రస్తుతం ‘మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తుండగా, భన్సాలీ ‘పద్మావతి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు.