కొత్తదనం ఆశించొద్దు… ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై  కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… చిరంజీవి (శ‌ర్వానంద్‌) ఆది ల‌క్ష్మి(రాధిక‌) కొడుకు అయినా ఆమె నలుగురు చెల్లెళ్లు కూడా త‌న‌ని త‌మ సొంత కొడుకులాగా పెంచుతారు. త‌న ఆస్థిగా వ‌చ్చిన ప‌ద్మావ‌తి క‌ళ్యాణ మండ‌ప నిర్వ‌హ‌ణంతా చిరంజీవే చూసుకుంటాడు. త‌న‌కు మూడుపదుల వ‌య‌సు దాటినా పెళ్లి కాదు. త‌ల్లి, న‌లుగురు పిన్ని లు  క‌లిసి.. మంచి అమ్మాయిని  చేయాల‌నే తాపత్ర‌యంతో వ‌చ్చిన సంబ‌ధాలన్నీ కాదంటుంటారు. దాంతో చిరుకి పెళ్లి కాదేమోన‌ని భ‌యం ప‌ట్టుకుంటుంది. అదే స‌మ‌యంలో త‌న‌కు ఆద్య (ర‌ష్మిక మంద‌న్న‌) ప‌రిచ‌యం అవుతుంది. ఆద్య‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు చిరంజీవి. అయితే త‌నకు త‌ల్లి త‌ర్వాతే ఎవ‌రైనా అని చెబితే.. ఆద్య చిరుని పెళ్లి చేసుకోవ‌డానికి నిరాక‌రిస్తుంది. ఆద్య స్నేహితురాలి ద్వారా, ఆమె త‌ల్లి గురించిన వివ‌రాలు తెల‌సుకున్న చిరంజీవి.. ప్రేమ‌ను గెలిపించుకోవ‌డం కోసం ఆమె ఇంట్లోకి అడుగు పెడ‌తాడు. మ‌రి చిరు ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా? ఆద్య అమ్మ న‌మ్మ‌కాన్ని గెలుచుకుంటాడా? ప్రేమ‌లో విజ‌యాన్ని సాధిస్తాడా? అనే విష‌యం తెలియాలంటే సినిమాలో చూడాలి..

విశ్లేషణ… శ‌ర్వానంద్ లాంటి టాలెంటెడ్‌ హీరో, రష్మిక లాంటి బ్యూటిఫుల్‌ హీరోయిన్‌.. వీళ్లంతా కలిసి నటించిన చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. రాధిక, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులు నటించిన చిత్రం కావడంతో… అలాగే  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ లోటుని తీరుస్తుందని భావించారు అంతా. అయితే, సినిమాలో కొత్తదనం కొరవడింది. రోటీన్‌ స్టోరీకి కామెడి, ఎమోషన్స్‌ని జోడించి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’సినిమాను తెరకెక్కించాడు కిశోర్‌ తిరుమల. చెప్పుకోవడానికి పెద్ద పేరున్న నటీ,నటులను తీసుకున్నాడు తప్పా.. వారి పాత్రలకు తగిన ప్రాధాన్యత మాత్రం సినిమాలో లేవు. శ‌ర్వానంద్ రీసెంట్‌గా చేసిన సినిమాల్లో, ఈ సినిమా కాస్త డిఫ‌రెంట్‌గా చేసిన‌ట్టే అనిపించింది. ర‌ష్మిక చీర‌క‌ట్టులో చూడ‌చ‌క్క‌గా అనిపించింది. శ‌ర్వా -ర‌ష్మిక పెయిర్ బావుంది. ఇక రాధిక‌, ఖుష్బూ, ఊర్వ‌శి, బెన‌ర్జీ తదిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సున్నితమైన హాస్యభరితమైన సన్నివేశాలతో ఫస్టాఫ్‌ అంతా కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. పెళ్లి కోసం హీరో పడే పాట్లు.. అలాగే వెన్నెల కిశోర్‌ కామెడీ కూడా నవ్వులు పూయిస్తుంది. పాత సినిమాల మాదిరే.. హీరోయిన్‌ ప్యామిలీని ఒప్పించడానికి హీరో హీరోయిన్‌ ఇంటికి వెళ్లడం… క్లైమాక్స్‌లో నిజం తెలిసి పోవడం, చివరకు వారి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం.. అన్నీ ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తాయి.ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగుతుంది. కొత్తదనం ఆశించొద్దు. ఊర్వశితో వచ్చే ‘టిఫిన్‌ బాక్స్‌’జోక్‌ థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది.

కిశోర్‌ తిరుమల డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి.. ఆలోచింపజేసేలా ఉన్నాయి. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతంలో టైటిల్ ట్రాక్ ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సాంగ్ కూడా బావుంది. ఇక మిగిలిన పాట‌లు ఓకే. నేప‌థ్య సంగీతం బావుంది. సుజిత్‌ సారంగ్‌ కెమెరా వ‌ర్క్ బావుంది. స‌న్నివేశాలలో ఫ్రెష్ నెస్ క‌నిపిస్తుంది – రాజేష్