గుణం లేని రణం… ‘రణరంగం’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2/5

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్సు పై సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధలోకి వెళ్తే… బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకునే దేవ (శర్వానంద్) హ్యాపిగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. అతనికో గర్ల్ ఫ్రెండ్ గీత (కళ్యాణి ప్రియదర్శన్). ఎంత కష్టపడినా బ్లాక్ టిక్కెట్లలో మిగిలేది తక్కువే. ఎలా డబ్బులు సంపాదించాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన మధ్యపాన నిషేధం కలిసి వస్తుంది. అప్పుడు ప్రక్క స్టేట్ ఒరిస్సా నుంచి లిక్కర్ స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించటం మొదలెడతాడు. పాల క్యాన్ లో అడుగున దాచి తెచ్చిన లిక్కర్ లక్షలు తెచ్చిపెడుతుంది. అది యూజ్ యూజవల్ గా లోకల్ ఎమ్మల్యే సింహాచలం (మురళి శర్మ) చేసే దొంగ లిక్కర్ వ్యాపారానికి దెబ్బ కొడుతుంది.తన వ్యాపారానికి గండి కొడితే ఎమ్మల్యే ఊరుకుంటాడా..తన మనుష్యులతో దేవపై దాడి చేయిస్తాడు. అక్కడ నుంచి ఆ గొడవలు పెరుగుతూ పోతాయి. దానికి అంతం అనేది ఉండదు. చివరకు అటు సింహాచలం..ఇటు దేవ ఇద్దరూ తమ సొంత మనుష్యులను సైతం కోల్పోతారు. ఆ క్రమంలో సింహాచలం మాయమైపోతాడు. దేవా ..అన్ని వ్యాపారాలు కట్టి పెట్టి స్పెయిన్ లో సెటిల్ అవుతాడు. కానీ అతని గతం అతన్ని తిరిగి వెనక్కి పిలుస్తుంది.

వైజాగ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దాని కోసం దాదాపు 12 వేల మది పేదలు నివసించే స్థలాన్ని ఖాళీ చేయించాలని అనుకుంటాడు అజయ్. దాని కోసం మినిస్టర్(బ్రహ్మాజీ) సహాయం కోరుతాడు. అయితే 12 వేల మంది వెనుక దేవా(శర్వానంద్) ఉన్నాడని, అతన్ని ఒప్పించాల్సి ఉంటుందని తెలుసుకుంటాడు. అయితే దేవా స్పెయిన్‌లో తన కూతురితో కలిసి ఉంటాడు. పేదలను తరిమేసి అక్కడ ఎయిర్ పోర్ట్ కట్టాలనే ప్రతిపాదనకి దేవా అంగీకరించడు. దాంతో దేవా సెంట్రల్ మినిష్టర్ రంగంలోకి దిగుతాడు. అయితే దేవా మాఫియా దెబ్బకు అతను భయపడి వెనకడుగు వేస్తాడు. తన పని జరగాలంటే దేవా అడ్డు తొలగించుకోవాలని భావిస్తాడు అజయ్. అదే సమయంలో అతనికి దేవా పాత శత్రువు సింహాచలం తోడవుతాడు. సింహాచలం కనిపించకుండానే, దేవాపై ఎటాక్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. ఓ ప్రయత్నంలో దేవా తీవ్రంగా గాయపడతాడు. చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్‌లో జాయిన్ అయిన దేవా తనపై ఎటాక్ చేసిందెవరో తెలుసుకోవాలనుకుంటాడు. చివరకు దేవా తన ప్రత్యర్థులను అంతం చేస్తాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషిస్తే… విభిన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపే శర్వానంద్ తో సుధీర్ వర్మ‌ దర్శకత్వంలో సినిమా అంటే.. ఆసక్తితో థియేటర్ వెళ్లే ప్రేక్షకుడికి నిరాశ కలగడం ఖాయం. ఎందుకంటే సినిమాలో దర్శకుడు చెప్పిన కధ ఇది వరకు చాలా సినిమాల్లో మనం చూసిందే. స్క్రీన్ ప్లే కూడా.. హీరో గతం,ప్రస్తుత పరిస్థితులను మిక్స్ చేసి చూపిస్తూ తెరకెక్కించారు. ఇలాంటి స్క్రీన్ ప్లే కూడా చాలా సినిమాల్లో చూసిందే.అలాగే గాడ్ ఫాధర్ నుంచి కొన్ని సీన్స్ చెప్పి మరీ కాపీ కొట్టాడు దర్శకుడు. కానీ ఆకట్టుకోలేకపోయాడు. విషయం కంటే విజువల్‌ యాంగిల్ పై దృష్టి ఎక్కువ వుండడంతో సన్నివేశాల్లో బలహీనతని గుర్తించలేకపోయారు.సన్నివేశాలు ఆసక్తికరంగా లేవు. మాట్లాడితే గన్స్ తో తిరుగుతూ డైలాగ్స్ చెప్పే పాత్రలు తప్ప ఏమీ ఉండదు. అసలు కథ ఎటు నుంచి ఎటు వెళ్తుందో.. కొంత దూరంవెళ్లాక కూడా అర్దం కాదు.దాంతో పరమబోర్ గా సినిమా సాగుతుంది.సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్‌ వేల్యూస్‌ని ఇష్టపడే వారిని ఆకట్టుకోవచ్చు.
 
నటీనటులు… శర్వానంద్..యువకుడుగా ఉన్నప్పటి పాత్రలో చాలా బాగా చేసాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ లో తన మార్క్ చూపించాడు. కళ్యాణి ప్రియదర్శన్‌ పరిచయమైన సన్నివేశాలు క్యూట్‌గా అనిపిస్తాయి. అయితే వచ్చిన నడి వయస్సు డాన్ గా మాత్రం శర్వానంద్ సరిపోలేదు. ఆర్టిఫిషియల్ గా ఉన్నాడు. హీరోయిన్స్ లో కాజల్ కు అసలు పాత్రే లేదు. కాజల్‌ అలంకారానికి మాత్రమే వున్నట్టు అనిపిస్తుంది. కళ్యాణి ప్రయదర్శిని మాత్రం బాగా చేసింది. ఆమెకు రాసిన డైలాగ్స్ బాగా పేలాయి.మురళీశర్మ డిఫరెంట్‌ లుక్‌, డైలాగ్‌ డెలివరీతో బాగా చేసాడు. బ్రహ్మాజీ, ప్రవీణ్,రాజా, ఆదర్శ్, నవీన్, హీరో కూతురిగా నటించిన అమ్మాయి పాత్రలకు న్యాయం చేశారు.
 
సాంకేతికం… ప్రశాంత్ పిళ్లై సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.పెళ్లి పాటని చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. సినిమాకు మంచి లుక్ తెచ్చిపెట్టింది. దర్శకుడి క్రియేటివ్‌ షాట్‌ మేకింగ్‌ని అంత ఎఫెక్టివ్‌గా స్క్రీన్‌ మీదకి తీసుకురావడం మాటలు కాదు.  న‌వీన్ నూలి ఎడిటింగ్ మాత్రం సెకండాఫ్ లో ఇంకొంత కత్తెర వెయ్యాలని అనిపిస్తుంది.ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి -రాజేష్