అనుభూతి ప్రధానంగా.. నిదానంగా నడిచే ‘జాను’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ పతాకంపై సి.ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ…  కె.రామచంద్ర‌(శ‌ర్వానంద్‌) ట్రావెల్ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ ప‌ని కోసం త‌న స్టూడెంట్‌తో వైజాగ్ వ‌చ్చిన రామ‌చంద్ర అక్క‌డ స్కూల్‌, థియేట‌ర్‌ను చూడ‌గానే త‌న గ‌త జ్ఞాపకాలు గుర్తుకువ‌స్తాయి. అప్పుడు త‌న‌తో పాటు 10వ త‌ర‌గ‌తి చ‌దువుకున్న ముర‌ళి(వెన్నెల‌కిషోర్‌), స‌తీష్‌(తాగుబోతు ర‌మేశ్‌)ల‌కు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్ర‌మంలో అంద‌రూ హైద‌రాబాద్‌లో కలవాల‌నుకుంటారు. అప్పుడు రామ‌చంద్ర‌, జానకి దేవి(స‌మంత )ని క‌లుసుకుంటాడు. దాదాపు 17 సంవ‌త్స‌రాలు త‌ర్వాత క‌లుసుకున్న ఇద్ద‌రూ రీ యూనియ‌న్ పార్టీ త‌ర్వాత జానకితో క‌లిసి రామ‌చంద్ర ఆమె ఉండే హోట‌ల్‌కి వెళ‌తాడు. అప్పుడు ఇద్ద‌రూ 10వ త‌ర‌గతి చ‌దువుకునేట‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం…ఎలా విడిపోయాం.. అనే సంగ‌తుల‌ను గుర్తుకు తెచ్చుకుంటారు. జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామ‌చంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అస‌లు రామ‌చంద్ర ఎందుకు పెళ్లి చేసుకోడు? ఎందుకు వీళ్లిద్దరూ ఒకటి కాలేకపోయారు.చివరకు అలనాటి ప్రేమికులుగా మిగిలిపోయారా?…లేక ఇప్పుడు ఒకటి అయ్యారా? వారి హృద‌యాల్లో ఏర్ప‌డిన మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మాహార‌మే ఈ సినిమా.

విశ్లేషణ… జ్ఞాపకాలను తట్టిలేపే ప్రేమకథలతో వచ్చే చిత్రాలు అరుదుగా వస్తాయి. అవి మన మనస్సుని ఎక్కడో తడతాయి. మనని ప్లాష్ బ్యాక్ లోకి నెడతాయి. అలాంటి కొన్ని సినిమాలు ప్రత్యేకం. అలాంటి అరుదైన ప్రేమ కథ..తమిళంలో హిట్టైన `96`. త్రిష‌, విజ‌య్ సేతుప‌తి జంట‌గా రూపొందిన ఈ చిత్రం అక్క‌డ ఘన విజ‌యాన్ని సాధించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు త్రిష‌కు 11 అవార్డుల్ని అందించింది. ఆ సినిమా రీమేక్ గా వచ్చిన తెలుగు చిత్రం ఈ ‘జాను’. ఈ సినిమా ప్ర‌ధానంగా రెండు పాత్ర‌ల మ‌ధ్య‌నే సాగుతుంది. విజ‌య్‌సేతుప‌తి, త్రిష పాత్ర‌ల‌ను శ‌ర్వానంద్‌, స‌మంత‌లు క్యారీ చేశారు. రెండు సినిమాల‌ను, ఆ పాత్ర‌ల‌ను పోల్చి చూస్తే క‌ష్ట‌మే కానీ.. దేనిక‌దే విడిగా చూస్తే..రామ్ పాత్ర‌లో శ‌ర్వా.. జానకి పాత్ర‌లో స‌మంత ఒదిగిపోయారు. చ‌క్క‌గా ఫీల్‌ను చూపించారు. ప‌ద‌వ త‌ర‌గ‌తిలో పుట్టిన ప్రేమ.. అనుకోని ప‌రిస్థితుల్లో విడిపోవ‌డం.. 17 ఏళ్ల త‌ర్వాత క‌లుసుకున్న‌ప్పుడు వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయ‌నేదే ఈ సినిమా.

ప్ర‌తి ఒక్క‌రికీ ప‌ద‌వ త‌ర‌గ‌తిలో కొన్ని ప్రేమ అనుభవాలు..ల‌వ్ బ్రేక‌ప్స్ ఉంటాయి. అలాంటి వారికి ఇందులోని కొన్ని స‌న్నివేశాలు మ‌న‌సుని తాకుతాయి.10వ త‌ర‌గ‌తిలో ఏర్ప‌డేది ప్రేమా? అంటే ఔన‌ని చెప్ప‌లేం… కాద‌ని చెప్ప‌లేం. దాదాపు ఇలాంటి ప్రేమ‌లు విఫ‌ల‌మే అవుతుంటాయి. కానీ అలాంటి ఓ క‌థ‌ను, కొన్ని సన్నివేశాల‌ను బేస్ చేసుకుని డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ సినిమాను తెర‌కెక్కించారు.అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కించారు..స్కూల్ లవ్ స్టోరీకి దాదాపు అందరూ కనెక్ట్ అవుతారు. ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో చాలా భాగం స్లో నెరేష‌న్‌లో సాగటం మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో మరీ వేగం తగ్గిపోతుంది. ఇది ప్రేక్ష‌కుడికి బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే, సినిమా అంత నెమ్మదిగా నడిచినా.. అనుభూతినిచ్చే కొన్ని సీన్స్ ఈ సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. ప్రేమ జ్ఞాపకాలున్న ప్రేక్షకులు ‘జాను’ చిత్రాన్ని బాగానే ఆస్వాదిస్తారు.

వెన్నెల కిషోర్‌, రఘుబాబు, తాగుబోతు రమేష్‌, శరణ్య ల నటన బాగుంది. శర్వానంద్‌, సమంతల చిన్నప్పటి పాత్రలుగా కనిపించిన సాయికుమార్‌, గౌరీ కిషన్‌ల నటనకూడా మనల్ని ఆకట్టుకుంటుంది.
 
మ‌హేంద్ర‌న్ జ‌య‌రాజ్‌ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది.విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకుంది ల‌వ్‌స్టోరీకి సంగీత‌మే ప్ర‌ధాన బ‌లం. గోవింద్ వ‌సంత పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల‌ను మ‌రో రేంజ్‌లో నిలిపాయి. కేఎల్ ప్రవీణ్ఎడిటింగ్ కూడా బాగుంది – రాజేష్