షీలారాజ్ ఫాబ్రిక్ ఆర్ట్ ‘సప్తవర్ణ సచిత్రం’ !

“ఇంట గెలిచి  రచ్చ గెలవమన్నారు’ పెద్దలు. కానీ ప్రసిద్ధ చిత్రకారిణిగా ముందు విదేశాల్లో విజయ పతాకం ఎగరవేసి ఇప్పుడు ఇండియాలో తన చిత్ర కళా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు షీలా రాజ్ గారు. షీలా రాజ్ గారి ప్రతి చిత్రం ప్రకృతితో మాట్లాడినట్లే ఉంటుంది. ఆమె ప్రత్యేకత “ఫాబ్రిక్ పెయింటింగ్” ఆమెకు అద్భుత భవిష్యత్తు ఉంది” అని ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ చంద్రబోస్ ప్రశంసించారు. నగరంలోని  సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన “షీలారాజ్ ఫాబ్రిక్ ఆర్ట్ ఎగ్జిబిషన్” కు ముఖ్య అతిథిగా హాజరైన చంద్ర బోస్ మాట్లాడుతూ…  అని గత రెండు దశాబ్దాల సుదీర్ఘ చిత్ర కళా ప్రయాణంలో షీలారాజ్ సమకాలీన “ఆర్ట్ వరల్డ్” లో ఎన్నో ప్రయోగాలు చేసి, ఫాబ్రిక్ పెయింటింగ్ లో సరికొత్త ప్రమాణాలు సృష్టించారని బోస్ కొనియాడారు.ఆమె కుంచెకు అన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అది సప్త వర్ణాలతో మమేకం కావడం మాత్రమే కాదు..ఆ కుంచెకు ప్రకృతితో మాట్లాడడం తెలుసు..ప్రకృతి భాషను చక్కగా అర్థం చేసుకోవడం తెలుసు. ప్రకృతి భావాలను చక్కగా ఫాబ్రిక్ పెయింటింగ్ ల ద్వారా వ్యక్తం చేయడం తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ప్రకృతికి చిత్రిక పట్టే ప్రసిద్ధ చిత్రకారిణి. షీలా రాజ్ ఫాబ్రిక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ను సక్సెస్ చేసి, ఆమె యూనిక్ చిత్రాలను మనసారా అభినందించాలని చంద్రబోస్ కోరారు.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు  షరీఫ్ మొహమ్మద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ…షీలారాజ్ చిత్రాలలో దాగివున్న అంతర్లీన భావాలను, సప్త వర్ణ సరాగాలను చక్కగా వివరించారు. ప్రస్తుతం షీలారాజ్ అమెరికాలో నివసిస్తున్నా ఆమె పెయింటింగ్స్ మాత్రం భారతీయతను, ప్రకృతిలోని రామణీయతను పుణికి పుచ్చుకున్నాయని షరీఫ్ అన్నారు. మాములుగా అందరూ కాన్వాస్ లపై, కాగితాలపై, ఇంకా అనేక విధాల పెయింటింగ్ చేయడం మనకు తెలుసు. కానీ షీలా రాజ్ తనదైన కొత్త శైలికి, వరవడికి ఫాబ్రిక్ పెయింటింగ్ ను ఎన్నుకొని తన విశిష్టతను, ప్రత్యేకతను చిత్ర కళా ప్రపంచంలో తన “ముద్ర”ను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన ప్రశంసించారు. షీలా రాజ్ ప్రకృతి పలికే రాగాలను మాత్రమే కాదు..కుంచె చిలికే సకల వర్ణ భావాలను కూడా చక్కగా అర్థం చేసుకుని ఫాబ్రిక్ పై ప్రతిబింబించే అరుదైన, అద్భుత ఫాబ్రిక్ పెయింటర్ అని షరీఫ్ ప్రస్తుతించారు.ఆమె ఫాబ్రిక్ పెయింటింగ్ కు మరింత ప్రాచుర్యం తీసుకు రావాల్సి ఉందని షరీఫ్ అభిప్రాయపడ్డారు.
సభలో గౌరవ అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షులు, ప్రముఖ చిత్రకారుడుఎం.వి. రమణారెడ్డి మాట్లాడుతూ..షీలా రాజ్ ప్రత్యేకత ఫాబ్రిక్ పెయింటింగ్ అని, ఆ ప్రత్యేక కళను ప్రతి ఒక్కరూ ప్రశంసించి, ప్రోత్సహించాలని అన్నారు. తాము అన్ని రకాల చిత్ర కళలను ప్రోత్సహిస్తామని, ముక్యంగా ఫాబ్రిక్ పెయింటింగ్ ను ఎన్నుకున్న షీలా రాజ్ ను కళా పోషకులు, కళాభిమానులు, కళాకారులు సముచిత రీతిలో సమాదరించాలని రమణా రెడ్డి కోరారు. ఈ సందర్బంగా ఆయన ఎగ్జిబిషన్ నిర్వాహకులను ప్రత్యేకించి ప్రశంసించారు.
చివరగా చిత్రకారిణి షీలా రాజ్ మాట్లాడుతూ.. సభకు హాజరై తనను, తన చిత్రాలను తులనాత్మకంగా అభివర్ణించి, అభినందించి, ఆదరించి ప్రశంసల జల్లు కురిపించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె తన రెండు దశాబ్దాల చిత్ర కళా  ప్రస్థానాన్ని సంక్షిప్తంగా ప్రస్తావించారు….
” నా చిత్ర కళా ప్రయాణం నా బాల్యంలో ఏడేళ్ల ప్రాయంలోనే ప్రారంభమైంది. మా స్కూల్ లో మొట్టమొదటి సారి స్టిల్ లైఫ్ పెయింటింగ్ పోటీల్లో పాల్గొని  ఫస్ట్ ప్రయిజ్ గెల్చుకున్నాను. అలా మొదలైన నా ప్రస్థానంలో పలు దేశాలకు చెందిన పలువురు కళా కోవిదుల వద్ద వివిధ కళా ప్రక్రియల్లో ప్రవేశాన్ని, ప్రావీణ్యాన్ని పొందాను. ఇంకా పలు దేశాల్లో నా చిత్రాలకు ప్రశంసలను, అవార్డులను, రివార్డులను అందుకున్నాను. ఇక పోతే హైదరాబాద్ లో 50కి పైగా టివి ఛానెల్స్ షోల్లో పాల్గొని చిత్ర కళా గౌరవాన్ని అందుకున్నాను. న్యూ యార్క్ ప్లెయిన్స్ బొరో పబ్లిక్ లైబ్రరీలో వరుసగా గత 2014 నుంచి 2015,2016,2017,2018 సంవత్సరాలలో లైవ్ డేమానిస్ట్రేషన్ చేశాను. గత కొన్నేళ్లుగా మన హైదరాబాద్ నగరంతో పాటు ఇండియాలోని పలు ప్రదేశాల్లో అనేక వర్క్ షాపులు, డేమానిస్ట్రేషన్లు నిర్వహించాను. ప్రస్తుతం నేను అమెరికాలో పిల్లలకు , మహిళలకు  ఆక్రీలీక్ ఫ్రీ హాండ్ డెకరేటివ్ పెయింటింగ్ లో, ఫాబ్రిక్ పెయింటింగ్ లో  శిక్షణను,  టెక్నీక్ లను  నేర్పిస్తున్నాను.ఈరోజు నా పెయింటింగ్ ఎగ్జిబిషన్ కు వచ్చి నన్ను ఆశీర్వదించిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగాదీని నిర్వహణలో పాలుపంచుకున్న ఫోర్త్ వాల్ థియేటర్, గ్లోబల్ యాక్సిస్ కమ్యూనికేషన్ నెట్ వర్క్ సంస్థలకు, వాటి సారథులు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని షీలా రాజ్ సవినయంగా మనవి చేశారు.
చివరగా..ప్రముఖ నటుడు, నట శిక్షకుడు, దర్శక నిర్మాత నల్లా అమరెందర్ వందన సమర్పణ చేశారు.