స్వయంగా అనుభవానికొస్తేనే మనకు అర్థమైంది!

“ఇతరుల పరిస్థితిని స్వయంగా అనుభవిస్తే కానీ మనుషులకు వాటి పట్ల జాలి, దయ రాదు. అది మన స్వభావం”….అని అంటోంది శ్రద్ధాకపూర్‌. “కరోనా వైరస్‌ ప్రపంచాన్ని బలవంతంగా క్వారంటైన్‌లో ఉండేలా చేసింది. స్వీయ నిర్బంధంలో ఉండటం వల్ల ఎలాంటి ఫీలింగ్‌ కలుగుతుందో ఇప్పుడు మనకూ అర్థమైంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం, బాధ.. ఇలాంటి భావోద్వేగాలు మనకే కాదు జంతువుకు కూడా ఉంటాయి… అవీ వీటిని అనుభవిస్తాయి. ఇతరుల పరిస్థితిని స్వయంగా అనుభవిస్తే కానీ మనుషులకు వాటి పట్ల జాలి, దయ రాదు. అది మన స్వభావం. బోనులో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మనకు అర్థమైంది. ఆ బాధను అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనతోపాటు భూమిపై ఉన్న ఇతర ప్రాణుల్ని కూడా ఇక్కడ బతకనిద్దాం.. వాటితో కలిసి జీవిద్దాం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది శ్రద్ధాకపూర్‌.
 
“లాక్‌డౌన్‌ వల్ల మనుషులు కొన్నాళ్ళ నిర్బంధాన్ని కూడా భరించలేకపోతున్నారని, కానీ జీవితాంతం బోనుల్లో ఉంటోన్న జంతువుల పరిస్థితి ఏంట”ని మూగ ప్రాణాల్ని ఉద్దేశిస్తూ భావోద్వేగ భరిత పోస్ట్‌ శ్రద్ధా పెట్టారు. అలాగే జూలో బందీలుగా ఉన్న కొన్ని జంతువుల ఫొటోలను కూడా ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసారు. శ్రద్దా ఈ ఏడాది ‘స్ట్రీట్‌ డాన్సర్‌ 3డి’, ‘బాఘీ 3’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండూ మంచి ఆదరణ పొందాయి. గతేడాది ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శ్రద్ధా పరిచయమై..ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు తెలుగులోనూ మరిన్ని అవకాశాలను పొందేలా చేసింది.
 
ఇప్పటికీ బాధపడుతుంటా!
సల్మాన్‌ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని వదులుకున్నానని శ్రద్ధా వెల్లడించారు. ‘నేను 16 సంవత్సరాల వయసులో ఉండగా సల్మాన్‌తో నటించే ఆఫర్‌ వచ్చింది. కానీ అప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పటికీ నేను చిన్న పిల్లను కాబట్టి స్కూలింగ్‌ పూర్తి చేసి కాలేజీలో చేరాలనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘‘తిరిగి నేను సినిమా అవకాశాలను పొందానన్న ఆనందం కంటే.. సల్మాన్‌తో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పటికీ బాధపడుతుంటాను. అలాగే సల్మాన్‌తో కలిసి నటించే గొప్ప అవకాశాన్ని వదులుకుని.. చదువుపై దృష్టి పెట్టడం కూడా చాలా కష్టం’’ అని కూడా చెప్పారు.
 
మహేష్‌ సరసన శ్రద్ధాకపూర్‌?
ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ మరోమారు తెలుగుతెరపై మెరవనుందట. మహేష్‌.. ‘గీతగోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కబోయే ఈ చిత్రంలో మహేష్‌ సరసన శ్రద్ధాకపూర్‌ని తీసుకోవాలనే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే శ్రద్ధాకి ఈ చిత్రకథని దర్శకుడు నెరేట్‌ కూడా చేశారట. గతంలో ‘సాహో’ చిత్రంలో నటించిన అనుభవం, మహేష్‌ వంటి స్టార్‌ సరసన నటించే అవకాశం రావడం అన్నింటికీమించి కథ, పాత్ర నచ్చడంతో శ్రద్ధా ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పి నట్టు తెలుస్తోంది. మే 31వ తేదీ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో లాంచ్‌ చేయాలని మహేష్‌ భావిస్తున్నారట.