ఆందోళన మాత్రం వెంటాడుతూ ఉండేదట!

శ్రద్ధా కపూర్‌ చాలా కాలంగా ఓ సమస్యను ఎదుర్కొంటోంది. అదేదో కొత్తది కాదు… బాలీవుడ్‌లో దీపికా పదుకొనే, షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌ వీరంతా ఆందోళనకు, ఒత్తిళ్లకు గురై కొంతకాలం పాటు చిత్రసీమకు దూరమైన వాళ్లే. దీపికా పదుకొనే అయితే మానసిక ఒతిళ్లకు గురైన వారి కోసం ప్రత్యేకంగా ‘లివ్‌ లాఫ్‌ లవ్‌’ అనే సంస్థనే పెట్టింది. ఇదే సమస్యను శ్రద్ధా కపూర్‌ కూడా ఎదుర్కొంటోందట. అదీ ఆరేళ్ల క్రితం నుంచి ఏదో తెలియని ఆందోళనతో బాధపడుతోందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పిందామె. ఈ సమస్య గురించి ఎంత మంది వైద్యులకు చూపించినా… రిపోర్ట్ లన్నీ తనకు ఏ సమస్యా లేదని తేల్చాయని పేర్కొంది. అయినా ఆందోళన మాత్రం వెంటాడుతూ ఉండేదట. ఎందుకిలా జరుగుతుందో తనకు తెలిసేది కాదట. ఆమె నటించిన ‘ఆషిఖి 2’ విడుదలైన దగ్గర నుంచి ఈ బాధను అనుభవిస్తుందట. ఈ ఆందోళనను తమకు తాముగా ప్రేమతోనే దూరం చేయవచ్చునని స్పష్టం చేసింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ నటించిన ‘సాహో’, ‘చిచ్చోరే’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘బాఘి’ ప్రాంచైజీలో మూడో భాగం తెరకెక్కుతోంది. టైగర్‌ ష్రాఫ్‌ ఇందులో కథానాయకుడు. ఇది కాకుండా రెమో డిసౌజా దర్శకత్వంలో వరుణ్‌ ధావన్‌ హీరోగా రూపొందుతోన్న’ స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ’లో కథానాయికగా చేస్తోంది.

దేని గురించీ రిగ్రెట్‌ ఫీలవ్వను
‘సాహో’ సినిమాతో సౌత్‌ ఇండియాకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాకపూర్‌ ఆమధ్య ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ‘సైనా’లో ఇప్పుడు పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తప్పుకున్నందుకు ఏమైనా పశ్చాత్తాప పడుతున్నారా? అనే ప్రశ్నను శ్రద్ధాకపూర్‌ ముందు ఉంచితే… ‘‘నా జీవితంలో నేను దేని గురించీ రిగ్రెట్‌ ఫీలవ్వను.నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. దురదృష్టవశాత్తు ‘సైనా’ ఫస్ట్‌ డే షూటింగ్‌లోనే నేను అనారోగ్యానికి గురయ్యాను. దాంతో షూటింగ్‌ కాస్త వాయిదా పడింది. ఆ లోపు ‘ఏబీసీడీ 3’లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ‘ఏబీసీడీ 2’ సినిమా నా కెరీర్‌లో మంచి హిట్‌. అలాంటప్పుడు ‘ఏబీసీడీ 3’ సినిమాకు నో చెప్పాలనుకోలేదు. అప్పటికే నేను ‘చిచ్చోరే’, ‘సాహో’ సినిమాలతో బిజీగా ఉన్నా. అందుకే ‘సైనా’ చిత్రానికి తిరిగి డేట్స్‌ కేటాయించలేకపోయాను.ఫలితంగా ఆ ప్రాజెక్ట్‌ చేజారింది’’ అని చెప్పారు.
ఒక బయోపిక్‌ని మిస్సయిన మీకు ఇప్పుడు ఎవరి బయోపిక్‌లో అయినా నటించాలని ఉందా? అనే ప్రశ్నకు  – ‘‘ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్‌ ఆలోచన ఉంది. ఆమెది గ్రేట్‌ జర్నీ. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’’ అని శ్రద్ధా పేర్కొన్నారు.