ఆ సూత్రాన్ని అతని నుంచే నేర్చుకున్నాను !

శ్రద్ధా కపూర్‌… బాలీవుడ్‌ సెలబ్రిటీ కూతురుగా వెండితెరకు పరిచయమయినా, ఆ తరువాత తన అందంతోనూ, నటనతోనూ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాయించుకుంది. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, వెండితెర మీద కధానాయికగా ఎదుగుతోంది. నిన్న మొన్నటి వరకూ శక్తి కపూర్‌ కూతురు శ్రద్ధా కపూర్‌ అని చెప్పుకునేవారు. ఇప్పుడు శ్రద్ధా కపూర్‌ తండ్రి శక్తి కపూర్‌ అని అంటున్నారు. శ్రద్ధా త్వరలోనే ప్రభాస్  ‘సాహో’ తో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. అంతేకాదు…బాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది….

సైనా బయోపిక్‌ కోసం చాలా కష్టపడుతున్నాను. కొన్ని నెలలుగా అలుపెరగకుండా బ్యాడ్మింటన్‌ ఆడుతున్నాను. పలు వరుస కూడా మార్పించుకున్నాను. సైనా ఎంత మంచి ప్లేయరో ప్రపంచానికంతా తెలుసు. ఈ బయోపిక్‌లో ఆమె ఆట, ఆమె సాధించిన విజయాలు అన్నీ చూపించబోతున్నారు. నేను పూర్తిగా ఆమెలాగా మారలేనని తెలుసు. అందులో సగమన్నా మారగలిగితే.. నా పాత్రకు న్యాయం చేసినదాన్ని అవుతాను. అందుకే కష్టమే అయినా.. ఇష్టంగా బాడ్మింటన్‌ నేర్చుకున్నాను. నా ఆటతీరును సైనా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు.పుల్లెల గోపీచంద్‌గారి దగ్గర కోచింగ్‌ తీసుకుంటున్నాను. ఇప్పటి వరకూ 40 క్లాసులకు అటెండ్‌ అయ్యాను. క్రీడాకారిణిగా కొనసాగడం అనేది ఆషామాయిషీ వ్యవహారం కాదు. దానికి ఎంతో పట్టుదల, దీక్షా అవసరం. అప్పుడే విజయాలు సాధిస్తారు. ఇవన్నీ సైనాలో పుష్కలంగా ఉన్నాయి.కథ పరంగా బరువు పెరిగితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతాను. అందుకే కొద్దిగా బరువు పెరిగాను. పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసు. తిరిగి సన్నబడగలను అన్న నమ్మకం నాకుంది”…అని అంటోంది శ్రద్ధా కపూర్‌.

#సంగీతం, పాటలు ఈ రెండింటిలో ఏది ఇష్టం అంటే చెప్పడం కష్టం. రెండింటినీ ఇష్టపడతాను. ఒక నటిగా డ్యాన్స్‌ చేయడం అంటే ఎంత ఇష్టపడతానో.. పాడడాన్ని కూడా అంతే ఇష్టపడతాను. పెయింటింగ్‌ అంటే కూడా ఇష్టం. వీలైతే నా భావాలను రచనల రూపంలో ప్రపంచంతో పంచుకోవడం ఇష్టం. నటిగా రిటైర్‌ అయిన తరువాత, పాటలు పాడడమే వృత్తిగా చేసుకుంటానేమో చెప్పలేను.

#హాలీవుడ్‌ నటుడు జిమ్‌ కెరీ ప్రభావం నాపై ఉంది. ఆయన అద్భుతమైన నటుడే కాదు మంచి పెయింటర్‌ కూడా. సాధారణంగా ఓ పని చేయలేనప్పుడు, నా దగ్గర అంత టైము లేదు అంటూ సాకులు చెబుతుంటాం. ఏ పని చేయడానికైనా ఎవరి దగ్గరనైనా బోలెడంత సమయం ఉంటుంది. కాకపోతే చేయాలన్న తపన ఉండాలి. అది ఉంటే సమయం దానంతట అదే వస్తుంది. ఈ సూత్రాన్ని జిమ్‌ కెరీ నుంచే నేర్చుకున్నాను. చేయాలనుకున్నది వెంటనే చేయమంటారు ఆయన. నేనూ అదే సూత్రాన్ని ఫాలో అవుతుంటాను. నిజ జీవితంలో అయినా, అంతే వెండితెర మీద అయినా అంతే! ఓ కథ నచ్చితే ఎలాగైనా ఆ సినిమా చేస్తాను. అంతే తప్ప డేట్లు లేవంటూ తప్పించుకోను.

#‘స్త్రీ’ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ సినిమా నా కెరీర్‌నే మలుపు తిప్పింది. నాసినిమాలు కూడా వందకోట్లు వసూలు చెయ్యగలవని నిరూపించిన సినిమా అది. ఎక్కడికి వెళ్ళినా అభిమానులు నన్ను ‘స్త్రీ’ అని పిలుస్తున్నారు.దెయ్యాలు, భూతాలను వ్యక్తిగతంగా అయితే నమ్మను. అయితే ఈ సినిమా తర్వాత ..మన కంటికి కనిపించని శక్తి ఏదో ఉందని నాకు అనిపించింది. ఆ శక్తిని దెయ్యమంటారో, భూతమంటారో నాకు తెలియదు.

#ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి అనిపించదు. ఊపిరి సలపని పనిలో ఉన్నప్పటికీ ‘ఒత్తిడి’గా ఫీలవను సరికదా… రోజుకు 48 గంటలు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అందుకే మనసుకు నచ్చిన పని చేయడానికే ఇష్టపడతాను. ఆ ఇష్టంలో ఆనందమే కాదు శక్తి కూడా ఉంది. వరుస సినిమాలు చేస్తున్నా ఇంత వరకూ అలసిపోవడం, ఒత్తిడికి గురికావడం జరగలేదు.