ఎందరు నిరాకరించినా శ్రద్ధ ముందుకొచ్చింది !

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా బాలీవుడ్‌లో ‘చందమామ దూర్ కే’ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో వ్యోమగామిగా నటిస్తున్నాడు సుశాంత్ సింగ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నారట. ముందుగా ఇందులో నటించేందుకు పలువురు కథానాయికలు నిరాకరించారు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం జుట్టును కట్ చేసుకోవాల్సి వస్తుందట. పైగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మరో సినిమాలో నటించే అవకాశం ఉండదు. పూర్తిగా కొన్ని నెలలపాటు ఈ సినిమాపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సన్నివేశాల కోసం శరీర బరువును కూడా తగ్గించాల్సి ఉంటుంది. దీంతో హీరోయిన్ క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే శ్రద్ధాకపూర్  ‘హసీనా’ చిత్రంలో ఎంతో వైవిధ్యంగా నటించింది. దీంతో  ‘చందమామ దూర్ కే’ సినిమా కోసం శ్రద్ధ అయితే బాగుంటుందని ఫిల్మ్‌మేకర్స్ ఆమెను తీసుకున్నారు. ఇప్పటికే హీరోహీరోయిన్లపై షూటింగ్ కూడా జరుగుతోందని తెలిసింది.

ముగ్గురు వ్యోమగాముల చుట్టూ తిరిగే ఈ కథాంశంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, సీనియర్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీలతోపాటు శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ నుంచి సెట్స్‌ పైకి వెళ్ళనుంది. వ్యోమగామిగా ఎలా ప్రవర్తిస్తారనే విషయంపై పాత్రకు సహజత్వం తీసుకురావడం కోసం హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇటీవల నాసాలో శిక్షణ కూడా తీసుకున్నాడు. అయితే ఇందులో ఆర్‌.మాధవన్‌ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నారు. శ్రద్ధా ప్రస్తుతం నటిస్తున్న ‘హసీనా పార్కర్‌’ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.