నా నాలుగు సినిమాలు దేనికదే !

శ్రద్ధా కపూర్‌… బాలీవుడ్‌లో అత్యంత బిజీ కథానాయికల్లో శ్రద్ధా కపూర్‌ ఒకరు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. త్వరలో ‘ఏబీసీడీ3’ సినిమా షూటింగ్‌లోనూ శ్రద్ధా పాల్గొనబోతోంది. డాన్స్‌ నేపథ్యంలో రూపొందబోయే ఈ చిత్రానికి రెమో.డి సౌజా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వచ్చిన ‘ఏబీసీడీ2’కి సీక్వెల్‌గా ‘ఏబీసీడీ 3’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇది ఆ సినిమాకి సీక్వెల్‌ కాదని నిర్మాత భూషణ్‌ కుమార్‌ తెలిపారు. ఇదో కొత్త వరవడి కాబోతుందని ఆయన వెల్లడించారు. ఇందులో వరుణ్‌ధావన్‌తో కలిసి శ్రద్ధా నటిస్తోంది. గతంలో వచ్చిన ‘ఏబీసీడీ 2’లోనూ ఈ ఇద్దరూ జోడీగా సిల్వర్‌ స్క్రీన్‌ మీద మ్యాజిక్‌ చేశారు. తాజా చిత్రంలో శ్రద్ధా పాకిస్తాన్‌కి చెందిన డాన్సర్‌గా ప్రేక్షకుల్ని అలరించనుందట. పంజాబీ కుర్రాడిగా వరుణ్‌ కనిపిస్తారు.లండన్‌లో ఈ ఇద్దరూ ఒకే టీమ్‌గా డాన్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన సినిమా. ప్రస్తుతం డాన్స్‌కి సంబంధించి ప్రముఖ కొరియోగ్రాఫర్లు ప్రశాంత్‌ షిండే, టానియా టోరియోల సారథ్యంలోని ఆఫ్రో, క్రంప్‌, లాకింగ్‌, పాపింగ్‌, టట్టింగ్‌ వంటి డాన్స్‌ టెక్నీక్స్‌ను శ్రద్ధా నేర్చుకుంటోందట. ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది.
శ్రద్ధా ఈ చిత్రంతోపాటు ‘సాహో’, ‘చిచ్చోర్‌’, సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటిస్తున్న విషయం విదితమే. ‘చిఛోర్‌’, సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో పాల్గొంటూ ప్రతి రోజూ హైదరాబాద్‌ టు ముంబయికి చక్కర్లు కొడుతున్నారట. అంతేకాదు ప్రస్తుతం నటిస్తున్న నాలుగు సినిమాలు దేనికదే పూర్తి భిన్నమైనవి కావడం విశేషం. పాత్రల్లో వేరియేషన్‌ చూపించే విషయంలో చాలా కష్టమైనప్పటికీ ఇష్టంగా చేస్తుందట. ఒకేసారి నాలుగు భిన్న నేపథ్య చిత్రాల్లో నటించే అవకాశం రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది శ్రద్ధా. ఈ నాలుగు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి.