విభిన్న పాత్రలు చేస్తేనే నటనలో పరిణతి !

శ్రద్ధా కపూర్‌… ప్రభాస్ తో ‘సాహో’ లో నాయికగా నటిస్తున్న అందాల బాలీవుడ్ స్టార్ . ప్రస్తుతం ఆమె ‘స్త్రీ’, ‘బట్టి గుల్‌ మీటర్‌ ఛాలు’, ‘సాహో’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ‘స్త్రీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’ఒకేసారి వేర్వేరు సినిమాల్లో భిన్నమైన పాత్రలు నటించడం కష్టంగా అనిపించినా.. నటనా పరంగా అది నాకెంతో ఉపయోగపడుతోంది’ అని శ్రద్ధా కపూర్‌ అన్నారు. ‘ఒకేసారి రెండు వేర్వేరు పాత్రలు పోషించడం వల్ల నన్ను నేను మెరుగుపరుచుకునేందుకు అవకాశం దొరుకుతుంది.నటనలో పరిణతి కనిపిస్తుంది. అదే సమయంలో ఒకే పాత్రలో లీనమై పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇది నాకే కాదు ప్రతి నటీనటుడికి వర్తిస్తుంది.
 
‘స్త్రీ’, ‘బట్టి గుల్‌ మీటర్‌ ఛాలు’, ‘సైనా నెహ్వాల్‌ బయోపిక్‌’ సినిమాల్లో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో నటిస్తున్నా. దర్శకులు నన్ను ఇలాంటి భిన్నమెన పాత్రలకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. సైనా బయోపిక్‌ ఫిట్‌నెస్‌ పరంగా ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సిన సినిమా. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే సైనా కథలో నేను నటించడం ఎంతో గర్వంగా ఉంది. వచ్చే నెల నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ‘సాహో’తోపాటు ఈ బయోపిక్‌పై దృష్టి పెట్టాను’ అని తెలిపారు. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కు ఆమోలీ గుప్త దర్శకత్వం వహిస్తున్నారు. హర్రర్‌ కామెడీ ‘స్త్రీ’ చిత్రం ఈనెల 31న విడుదల కానుంది. ఇక ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే.
సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా శ్రద్ధ
ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌  పురాతన వజ్రాలు దొంగిలించే క్రేజీ దొంగ పాత్రలో కనిపించనున్నారని సమాచారం.ప్రభాస్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునే సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ గా శ్రద్ధ కనిపించనున్నారు. మరి ఈ దొంగా పోలీస్‌ ఆట ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన మూడవ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.
 
అలాగే ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ను రొమేనియాలో ప్లాన్‌ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీలు కూడా పాల్గొంటారు. రీసెంట్‌గా అబుదాబిలో ముగిసిన యాక్షన్‌ షెడ్యూల్‌ మాదిరిగానే ఈ రొమేనియా షెడ్యూల్‌ కూడా ఉంటుందని టాక్‌. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో సినిమా  పూర్తవుతుందట. లాల్, ఎవెలిన్‌ శర్మ, మురళీ శర్మ, అరుణ్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్‌ ఎహసన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్నారు.